-వెయ్యి పడకలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
-పూర్తిగా విదేశీ పెట్టుబడితో ఏర్పాటుకు నిర్ణయం
- సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రతినిధి బృందం
-సహకరించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: హైదరాబాద్‌లో వెయ్యి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ముందుకొచ్చింది. ఆసుపత్రి ఏర్పాటుకు కావాల్సిన సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. హాస్పిటల్‌కు కావాల్సిన స్థలం సమకూర్చడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు అందిస్తామని చెప్పారు. ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఛైర్మన్ ప్రొఫెసర్ మైక్ పార్కర్, గ్రూప్ సీఈవో డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా, భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ మైక్ నితావ్రికాన్సిస్, భారత ప్రభుత్వ ఇన్వెస్ట్ ఇండియా గ్రూప్ మేనేజర్ ఉదయ్ మంజుల్ తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పుతామని వెల్లడించారు. పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో నిర్మించే ఆసుపత్రికి కావాల్సిన స్థలం ఇవ్వాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో స్థలం ఇవ్వడానికి సీఎం అంగీకరించారు. స్థలం ఎంపిక తర్వాత ఎంవోయూ కుదుర్చుకోవడానికి నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, టి.హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తివారి, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఇండో యూకే ఆస్పత్రి
Published Mon, Apr 25 2016 6:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement