పారిశ్రామిక విప్లవం 4.0
► రేపటి నుంచి భారత సాంకేతిక సదస్సు
► బెంగళూరు వేదికగా శాస్త్రవేత్తల సమావేశం
► పారిశ్రామిక, వ్యవసాయరంగాలపై చర్చలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, బెంగళూరు: భారత్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రేపటి నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో ‘ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్–2017’ నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు 2013లో తొలిసారి బెంగళూరులోనే మొదలైంది. ప్రపంచ దేశాలు నాలుగో పారిశ్రామిక విప్లవంవైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాది ‘పారిశ్రామిక విప్లవం 4.0’ పేరుతో కీలక సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్(ఐటీసీ) చైర్మన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.వి. మురళీకృష్ణారెడ్డి అధ్యక్షత వహిస్తారు. భారత్ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు 10 అంశాలు కీలకమని భావించిన నిర్వాహకులు కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సిస్టమ్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. నిమ్‌హాన్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సదస్సులో అమెరికా, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు హాజరై డెమోలు ఇస్తారు. ఇస్రో సాధించిన విజయాలపైనా ప్రత్యేక చర్చ ఉంటుంది. వెయ్యి మంది పారిశ్రామికరంగ ప్రతినిధులు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రభుత్వరంగ నిపుణులూ పాల్గొంటారు.
వ్యవసాయరంగంపై ప్రత్యేక సదస్సు
సదస్సులో భాగంగా వ్యవసాయంపై 200 మందితో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. ఇక్రిశాట్, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొననున్న ఈ వర్క్‌షాపులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, కూలీలు, సాగులో జాగ్రత్తలపై చర్చలు జరుపుతారు. ఇటీవల శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన విజయాలు, సాధించాల్సిన అంశాలపై 48 స్టాళ్లతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భారత రక్షణ పరిశోధన–అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఓఎన్‌జీసీ, ఐబీఎం, ఇక్రిశాట్, ఇస్రో సంస్థల ప్రతినిధులు కొత్త టెక్నాలజీ అంశాలను వివరిస్తారు. ఎఫ్‌ఈఈ(ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌లెన్సీ), డబ్ల్యూఏఈ(వరల్డ్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్), ఏఐఎంఓ(ఆలిండియా మాన్యుఫాక్చరర్స్ ఆర్గనైజేషన్), ఏఎస్‌ఎంఈ (అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్), ఐఐపీఈ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఐఐపీఈ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉడే. పి.కృష్ణా, బెంగళూరు ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అన్నాదొరై, అగ్రిటెక్ చైర్మన్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్, ఐటీసీ నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆర్.ఎం. వాసగమ్, కర్ణాటక వ్యవసాయ, ఉద్యానవన శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.మహేశ్వరరావు తదితర ప్రతినిధులు హాజరుకానున్నారు.
దేశాభివృద్ధికి దోహదం
సాంకేతిక రంగ నిపుణులకు ఈ సదస్సు చక్కని వేదిక. పరిశోధన, సాంకేతిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై చర్చలు జరుగుతాయి. సదస్సు మన దేశా భివృద్ధికి దోహదపడు తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగసంస్థలకు, విద్యార్థులకూ ప్రయోజనం ఉంటుంది.
– డాక్టర్ ఎల్.వి. మురళీకృష్ణారెడ్డి, ఐటీసీ చైర్మన్