పాపాలు!
- యథేచ్ఛగా కల్తీ పాల విక్రయం
- లోకల్ డెయిరీల అక్రమాలు
- ప్రజల ఆరోగ్యానికి ముప్పు
- అమలు కాని కల్తీ నిరోధక చట్టం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. వీరిని కట్టడి చేయడంలో జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖల విభాగాలు దారుణంగా విఫలమవుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టం(2006) అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో విక్రయిస్తున్న వివిధ బ్రాండ్ల పాలల్లో (ప్యాకెట్ పాలు) ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించేఇ.కోలి, సాల్మొనెల్లా, యూరియా ఆనవాళ్లు బయటపడుతున్నా ఈ విభాగాలు ప్రేక్షక పాత్ర వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే అంశంపై రాష్ట్ర బాలల హక్కుల సంఘం గతంలో మానవ హక్కుల సంఘం, లోకాయుక్తను ఆశ్రయించాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్పట్లో హడావుడిగా కొన్ని లోకల్ డెయిరీలపై దాడులు చేసి, స్వల్ప మొత్తంలో జరిమానా విధించి మమ అనిపించారు. నేటికీ కల్తీని నిలువరించేందుకు పటిష్ట చర్యలు తీసుకోకపోవడంతో నగరంలో యథేచ్ఛగా పాల కల్తీ జరుగుతోందని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, బాలల హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆందోళన కలిగిస్తున్న కల్తీ
మహా నగర పరిధిలో రోజుకు సుమారు 40 లక్షల లీటర్ల పాలు అవసరం ఉండగా ఏపీ డెయిరీ, మదర్ డెయిరీ, తిరుమల, జెర్సీ, దొడ్ల, ముకుంద, రిలయన్స్, వైష్ణవి, హ్యాట్‌సన్ వంటి ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు సుమారు 35 లక్షల లీటర్లు విక్రయిస్తున్నాయి.
- గ్రేటర్ పరిధిలో రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల కొరత ఉంది.
- నగరానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లో పాల ఉత్పత్తి కనిష్ట స్థాయికి పడిపోవడం, పశు పోషణ తగ్గడం, సంస్థాగత రుణాలు లభ్యం కాకపోవడం, నిర్వహణ భారంగా మారడంతో పలువురు ఔత్సాహికులు, రైతులు డెయిరీలను నిర్వహించలేకపోతున్నారు.
- ఇదే అదనుగా డెయిరీల నిర్వాహకులు చిక్కదనం పెరిగేందుకు పాలపొడి, కార్న్‌ఫ్లోర్, డాల్డా వంటి వంటనూనెలకు సంబంధించిన కొవ్వు పదార్థాలను పాలలో కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- లోకల్ డెయిరీలు విక్రయిస్తున్న పాలను నిబంధనల ప్రకారం సూక్ష్మజీవ రాహిత్యం(పాశ్చరైజేషన్) చేయడం లేదని బాలల హక్కుల సంఘం పరిశీలనలో తేలింది.
- వివిధ బ్రాండ్ల పాలలో ఇ.కోలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. మరికొన్నింటిలో యూరియా ఆనవాళ్లు గుర్తించారు.
- పాలలో నురుగు, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది.
- పాలల్లో ఇ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండడంతో వీటిని తాగిన వారు తీవ్రమైన జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. కడుపు నొప్పి, డయేరియా వ్యాధులతో బాధ పడుతున్నారు.
- సాల్మొనెల్లా బాక్టీరియా ఆనవాళ్లున్న పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతోంది.
- యూరియా ఆనవాళ్లున్న పాలను తాగిన వారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- మరికొన్ని డెయిరీల నిర్వాహకులు రెండు మూడు రోజుల పాటు పాలు నిల్వ ఉండేందుకు వివిధ రకాలైన రసాయనాలను కలుపుతున్నట్లు తేలింది. వీటిని తాగిన వారుగొంతు నొప్పి బారిన పడుతున్నారు.
కాగితాలపైనే చట్టాలు..
పాలకల్తీని అరికట్టేందుకు ఆహార కల్తీ నిరోధక చట్టం(2006)ను అమలు చేయడంలో ఇటు జీహెచ్‌ఎంసీ, అటు వైద్య ఆరోగ్య శాఖలు దారుణంగా విఫలమవుతున్నాయి. దీంతో ఈ చట్టం కాగితం పులిలా మారింది. ఈ చట్టంలోని సెక్షన్-34 ప్రకారం సురక్షితం కాని పాలు విక్రయిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
కొరతకు ఇదో నిదర్శనం..
ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ (ఏపీ డెయిరీ) నగరంలో రోజుకు సుమారు 3.9 లక్షల లీటర్ల పాలను మాత్రమే సరఫరా చేస్తోంది. ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో కర్ణాటక డెయిరీ నుంచి లక్ష లీటర్లు, బాలాజీ డెయిరీ నుంచి 50 వేల లీటర్లను కొనుగోలు చేస్తోంది. గతంలో నిల్వ చేసిన పాల పొడిని సైతం పాల తయారీకి వినియోగించినట్టు లాలాపేటలోని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ సహకార సమాఖ్య జనరల్ మేనేజర్(ఎంపీఎఫ్) ఏడు కొండలు రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.