
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథకు అవసరమయ్యే నీటిపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. మార్చి రెండో వారం నుంచి భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ప్రాజెక్టు ల్లో అవసరమైన నీటి నిల్వలు ఉంచేలా చర్యలకు ఉపక్రమించింది.
ఆగస్టులో వర్షాలు కురిసే నాటికి కనిష్టంగా 35 టీఎంసీల నీటిని భగీరథ కోసం పక్కన పెడుతోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని 37 ప్రాజెక్టుల నుంచి భగీరథకు ఏటా 59.17 టీఎంసీలు తీసుకోవాలని ఇదివరకే నిర్ణయించారు. గోదావరి నుంచి 32.17, కృష్ణా బేసిన్ నుంచి 23.08 టీఎంసీలు తీసుకునేలా ప్రణాళిక వేశారు.
ఏప్రిల్ నుంచి సాగుకు బంద్
ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క ఎస్సారెస్పీ కిందే 5.15 లక్షల ఎకరాలకు నీరందిస్తుండగా, నాగార్జున సాగర్ పరిధిలో 5 లక్షల ఎకరాల మేర నీరిస్తున్నారు. ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ సమీక్షించి భగీరథ అవసరాల దృష్ట్యా 4 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ కింద నీరివ్వాలని, మిగిలిన 6 టీఎంసీలు పక్కన పెట్టాలని సూచించారు. ఏప్రిల్ 16 నుంచి కాలువ మూసివేయాలని, మార్చి 20 నుంచి లోయర్ మానేరు డ్యామ్ కాల్వ మూసివేయాలని ఇంజనీర్లను ఆదేశించారు.
ఆగస్టు నాటికి 35 టీఎంసీల నిల్వ
శ్రీశైలంలో 32 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 30 టీఎంసీల నీటి లభ్యత ఉంది. తెలంగాణ వాటా కింద 28 టీఎంసీల మేర దక్కే అవకాశముంది. సాగర్ ఆయకట్టు అవసరాలకే 16, భగీరథకు 12 టీఎంసీలు నిల్వ ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 5 నుంచి సాగర్ ఎడమ కాల్వ తూములను మూసివేయనున్నారు. పాలేరులో 4.70, వైరాలో 1.2, పెద్దదేవులపల్లిలో 0.12, ఉదయం సముద్రంలో 2.50, టెయిల్‌పాండ్‌లో 2 టీఎంసీల మేర నిల్వలుంచేలా అధికారులకు ఆదేశాలందాయి.
ఆగస్టు నాటికి 35 టీఎంసీల మేర పక్కన పెట్టి సాగుకు నీరం దించేలా చర్యలు తీసుకుంటున్నారు. సాగర్ లో భగీరథ, సాగు అవసరాలు పోగా హైదరాబాద్ తాగు అవసరాలకు మరో 15 టీఎంసీల మేర నీటి అవసరం ఏర్పడుతోంది. దీంతో హైదరాబాద్ అవసరాల కోసం సాగర్ కనీస మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని నీటిపారుదల శాఖ ఇప్పటికే జల మండలికి సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment