రంజాన్ రోజు ఏం చేద్దామని? | IS terrorists may have planned for blasts on ramzan | Sakshi
Sakshi News home page

రంజాన్ రోజు ఏం చేద్దామని?

Published Tue, Jul 5 2016 8:08 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

రంజాన్ రోజు ఏం చేద్దామని? - Sakshi

రంజాన్ రోజు ఏం చేద్దామని?

జాతీయ దర్యాప్తు సంస్థ అత్యంత పకడ్బందీగా పొందిన సమాచారంతో మంగళవారం నాడు హైదరాబాద్ నగరంలో మరోసారి సోదాలు చేసింది. పాతబస్తీలోని తలాబ్ కట్ట, బార్కాస్ ప్రాంతాల్లో చేసిన ఈ సోదాలలో 17 లైవ్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సిద్ధంగా ఉంచుకున్నారంటే... ఐఎస్ టార్గెట్ ఏమై ఉంటుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రంజాన్ నాటికి రక్తపాతం సృష్టించాలని ఇంతకుముందు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పిలుపునిచ్చింది. దానికి తగ్గట్లే వివిధ దేశాల్లో ఈ నెల రోజుల్లో దాదాపు 800 మందిని హతమార్చింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా ఇదే తరహా మారణహోమం సృష్టించడానికి సిద్ధమైనట్లు ఎన్ఐఏ వద్ద పక్కా సమాచారం ఉండటం వల్లే బార్కాస్, తలాబ్ కట్ట ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

సరిగ్గా వారం రోజుల క్రితమే ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు కలిసి సంయుక్తంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురిని వదిలిపెట్టి, ఐదుగురిని అరెస్టు చేశారు. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ లైవ్ పేలుడు పదార్థాలను సిద్ధంగా ఉంచుకున్నారంటే.. రాబోయే రెండు మూడు రోజుల్లోనే విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈసారి రంజాన్ను రక్తసిక్తం చేయాలని ఇస్లామిక్ స్టేట్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి వారం క్రితం ఉగ్రవాదులను అరెస్టు చేసినప్పుడే.. ఎన్ఐఏ వర్గాలు పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, యూరియా, యాసిడ్, కొన్ని రసాయనాలు,  ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ. 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాయి. ఐఎస్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే వీళ్లంతా పనిచేస్తున్నట్లు అప్పట్లో స్పష్టంగా తేలింది. ఆ ప్రకారమే.. ఇప్పుడు కూడా రక్తపాతం సృష్టించడానికి ఉగ్రవాదులు సర్వసన్నద్ధంగా ఉన్నారా అనేది విచారణలో తేలాల్సిన అంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement