ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు అధికారి ఎస్‌ఏవీ ప్రసాదరావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వి.సుందర్‌లు ఉన్న ఫళంగా రిలీవ్ కావాల్సిందేనని ప్రభుత్వం శుక్రవారం మరో జీవో జారీ చేసింది. ఈ నెల 5న వీరిరువురు బదిలీలపై ప్రభుత్వం జీవో నెంబరు 5 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 6న రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం బదిలీలు నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఈ లేఖపై రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, సీఎం పేషీ ఆగ్రహంతో ఉన్న వైనంపై శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సర్కారు వెంటనే అధికారులిద్దరూ రిలీవ్ కావాల్సిందేనని రెండో జీవో జారీ చేసింది. దీంతో మంత్రి శిద్ధా, సీఎం పేషీ అధికారి ఒకరు తమ పంతం నెగ్గించుకున్నట్లయింది.
రవాణా శాఖ కార్యాలయంలో జేటీసీగా పనిచేస్తున్న ప్రసాదరావు తన బాధ్యతల్ని అదనపు కమిషనర్‌కు అప్పగించి వెంటనే రిలీవ్ కావాలని, విజయవాడలో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడలో పనిచేస్తున్న డీటీసీ సుందర్ అనంతపురంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ ఉత్తర్వులిచ్చారు.