ఐటీ హబ్‌లో అంధకారం
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ హబ్‌లో గాడంధకారం అలుముకుంది.. ఐటీ కంపెనీలకు, వీఐపీల నివాసాలకు నిలయమైన రాయదుర్గం, ప్రశాంతి హిల్స్‌లో మంగళవారం గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూటల్ జంపర్ కట్ కావడంతో రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు సరఫరా ఆగిపోయింది. ప్రధాన లైన్లతో పాటు డిస్ట్రిబ్యూషన్ లైన్స్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం సెంట్రల్ డిస్కం వద్ద లేకపోవడంతో సిబ్బంది లైన్ టు లైన్ తనిఖీ చేసి, లోపాన్ని గుర్తించి సరఫరాను పునరుద్ధరించడానికి సుమారు 15 గంటల సమయం పట్టింది. ఇక, ఇన్సులేటర్ పేలిపోవడంతో యాకుత్‌పురలో మంగళవారం మధ్యాహ్నం ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. లోపాన్ని గుర్తించి, సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది చాలా ఇబ్బందే పడాల్సి వచ్చింది. ఇవి చాలు నగరంలోని విద్యుత్ సరఫరా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి!
ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడుతున్నాయి. గాలికి వైర్లు మెలికలు తిరుగుతుండటంతో ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లలో ఫీజులు ఎగిరిపోతున్నాయి. లోపాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో గ్రేటర్‌లో నిత్యం ఏదో ఒకచోట సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్య ప్రధానంగా శివారు ప్రాంతాలైన గచ్చిబౌలి, రాయదుర్గం, బాలానగర్, కూకట్‌పల్లి, వనస్థలిపురం, బాలాపూర్, చాంద్రాయణగుట్ట, బోడుప్పల్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో నెలకొంది.
స్కాడా.. ఏదీ నీ జాడ..?
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 కేవీ సబ్‌స్టేషన్లు పది ఉండగా, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 300లకు పైగా ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు రెండు వేల ఫీడర్లు, దాదాపు 90 వేల కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు, 300 కి.మీ. పరిధిలో యూజీ కేబుళ్లు ఉన్నాయి. ప్రధాన విద్యుత్ లైన్లలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను గుర్తించేందుకు 2004లో స్కాడాను ఏర్పాటు చేశారు. ప్రధాన సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే లైన్లన్నీ కంప్యూటర్‌కు అనుసంధానించారు. మొదట్లో దీని పనితీరు ఆశాజనకంగా కన్పించినా...అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం పరికరాల వినియోగం వల్ల ఏడాది గడవక ముందే అది అటకెక్కింది. ఇదిలా ఉంటే ఫీడర్ల నుంచి గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేసే వ్యవస్థలో తలెత్తుతున్న లోపాలను గుర్తించడానికి నాలుగేళ్ల క్రితం గ్రేటర్‌లో ఆర్-ఏపీడీఆర్‌పీ పథకం కింద ప్రవేశపెట్టిన‘జియోగ్రాఫికల్ ఇన్పర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)’ నేటికీ అందుబాటులోకి రాలేదు. లోపాన్ని గుర్తించి సరఫరాను పునరుద్ధరించేందుకు ఐదారు గంటలు పడుతోంది. అసలే వర్షాకాలం, ఆపై అర్ధరాత్రి ఇంట్లో మస్కిటో కాయిల్స్, ఫ్యాన్లు పని చేయక పోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కొరవడుతున్న పర్యవేక్షణ..
టోలిచౌకి, గచ్చిబౌలి, షేక్‌పేట్, చంపాపేట్, మాదాపూర్, కంచన్‌బాగ్, కొంపెల్లి, మేడ్చల్, నాచారం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, దూరదర్శన్ కేంద్రం, నాగోల్, మన్నెగూడ, మామిడిపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఎత్తై వృక్షాలు ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్‌కు గురై ఫీడర్లు టిప్పవుతున్నాయి. స్థానికులెవరైనా దీన్ని గుర్తించి అధికారులకు సమాచారం చేరవేస్తే సరి.. లేదంటే తలెత్తిన ఈ అంతరాయానికి కారణం ఏమిటో కనుక్కోవడం అధికారులకు పెద్ద పరీక్షే అవుతోంది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఆయా లైన్లలో ప్రతి మూడు మాసాలకు ఒక సారి లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతూనే ఉన్నారు. లైన్లకు అడ్డంగా ఏపుగా పెరిగిన చెట్లను నరికేయడం, వేలాడుతున్న వైర్లను సరి చేయడం, ఇన్సులేటర్లు, కండెన్సర్లను మార్చడం వంటి పనులకు భారీగా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే ఈ పునరుద్ధరణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన డిస్కం అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరిపాటిగా మారింది..
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంగళవారం రాత్రి 8 గంటలకు పెద్దగా శబ్దం వచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం వరకూ పునరుద్ధరించ లేదు. తరచూ ఇలా సరఫరా నిలిచిపోవడం సరిపాటిగా మారింది.
- కె.నర్సింహా, ప్రశాంత్‌హిల్స్
రాత్రంతా జాగారమే
గాలి, వర్షం వచ్చిందంటే చాలు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఒకరోజు రాత్రంతా కరెంట్ లేదు, మరో గంటల తరబడి నిలిచిపోయింది. మంగళవారం రాత్రంతా విద్యుత్ లేకపోవడంతో జాగారం చేయాల్సి వచ్చింది.
- ఆంజనేయులు, ప్రశాంత్‌హిల్స్