
ఇది మాకు పునర్జన్మ!
ప్రతిక్షణం ప్రాణ భయమే.. తిరిగి ఇంటికి వస్తామని అనుకోలేదు
- ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కిషన్
- లిబియాలో ఉగ్రవాదుల చెర నుంచి విడుదలై ఇంటికి చేరిన ప్రొఫెసర్లు
- సుమారు 14 నెలల నిర్బంధం తర్వాత స్వదేశానికి
సాక్షి, హైదరాబాద్: ‘అవి చీకటి రోజులు. ప్రతి క్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతి కాం. తిరిగి ఇంటికి వస్తామని అనుకోలేదు. మాకు ఇది పునర్జన్మ’ సుమారు 14 నెలలపాటు లిబియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న ప్రొఫెసర్ గోపీకృష్ణ, ప్రొఫెసర్ బలరాం కిషన్‌ల మనోగతం ఇది. అమెరికా సైన్యం సహాయం తో ఈనెల 14న ఉగ్రవాదుల చెర నుంచి విము క్తి పొందిన వీరిద్దరు శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరి రాకతో కళ్లు కాయలు కాచే లా ఎదురు చూసిన ఆ రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని బలరాం కిషన్, నాచారంలోని గోపీకృష్ణ ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంది.
పద్నాలుగు నెలల నిర్బంధంలో బిక్కుబిక్కుమంటూ బతికిన ప్రొఫెసర్లు తమ భార్యా పిల్ల లు, కుటుంబసభ్యులను చూసి ఆనందబాష్పా లు రాల్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత తన కు టుంబాన్ని చూసుకోగలిగానని గోపీకృష్ణ సం తోషం వ్యక్తం చేశారు. 14వ తేదీనే ఉగ్రవాదుల చెర నుంచి బయటపడినప్పటికీ 21 వర కు లిబియాలోని భారత రాయబార కార్యాలయంలోనే ఉండి, 2 రోజుల కిందట ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ పర్యవేక్షణలోనే ఉన్న వీరిద్దరూ.. అధికారుల సాయం తో తమ ఇళ్లకు చేరుకున్నారు. గోపీకృష్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘ఎందుకు కిడ్నాప్ చేశారో తెలి యదు. అసలు వదిలేస్తారో లేదో, ఎంత కాలం ఆ చెరలో ఉండాలో తెలియని భయంకరమైన ప్రశ్నలు వేధించేవి’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అనుభవాలు ఆయన మాటల్లోనే..
అసలేం జరిగింది..
2015 జూలై 29న మేం పని చేస్తున్న సిర్తే యూనివర్సిటీ నుంచి ఇండియాకు బయలుదేరాం. ట్రిపోలీ పూర్తిగా ఉగ్రవాదుల నిర్బంధం లో ఉంది. దేశానికి రావాలంటే ట్యూనిషియా మీదుగా దుబాయ్ వెళి అక్కడి నుంచి రావలసిందే. ఆ రోజు వర్సిటీ నుంచి కారులో కొద్దిదూరం రాగానే ట్రిపోలీ చెక్‌పోస్టు వద్ద కొందరు మమ్మల్ని వెంబడించి నిర్బంధంలోకి తీసుకున్నారు. మా కిడ్నాప్ వార్త బయటి ప్రపంచానికి తెలుసో లేదో కూడా తెలియని భయంకరమైన నిర్బంధంలో 414 రోజులు గడిచాయి. అది పూర్తిగా జైలు జీవితం లాంటిదే. రాత్రి, పగలు మాత్రమే తెలిసేది. మాకు మేం మాట్లాడుకోవడం తప్ప మరో ప్రపంచం తెలియదు. ఎక్కడ ఉన్నామో తెలియదు. కాగితం పైన రాసుకుని ఒక అంచనాతో రోజులు, వారాలు లెక్కించుకొ నే వాళ్లం. నన్ను, బలరాం కిషన్‌ను ఒకే గదిలో బంధించారు.మాతోపాటు విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌లను కూడా కిడ్నాప్ చేశారు. కాని రెండు రోజుల్లోనే వదిలేశారు. మమ్మల్ని ఎం దుకు కిడ్నాప్ చేశారో, ఎప్పుడు వదిలేస్తారో చెప్పలేదు. ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు.
మూడు నెలలకోసారి డెన్ మార్పు
2,3 నెలలకో సారి డెన్ మార్చేవాళ్లు. మమ్మల్ని కొట్టడం, దూషించడం వంటి వేధింపులకు పాల్పడలేదు. నూడుల్స్ వంటి ఆహారం మెక్‌డోనా, ఈజిప్షియన్ రైస్ ఇచ్చేవారు. తినలేకపోయేవాళ్లం. మా కిడ్నాప్ తర్వాత సిర్తే యూని వర్సిటీ అధికారులు కానీ, సహాధ్యాయులు కానీ మా కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అదే చాలా బాధనిపించింది.
అందరికీ కృతజ్ఞతలు..
ఈనెల 14వ తేదీ మా జీవితంలో గొప్ప వెలుగు తెచ్చిన సుదినం. అమెరికా సైనికులు, లిబియా ఆర్మీ, భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు. అందరి కృషి వల్ల చెర వీడి బయటకు వచ్చాం. ఉగ్రవాదుల చెర నుంచి నేరుగా లిబియాలోని మన రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ అన్ని సేవలు లభించాయి. ఆప్యాయంగా పలకరించారు.
ఇదీ నేపథ్యం..
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. 2004 నుంచి 2007 వరకు భువన గిరి అరోరా కళాశాలలో పని చేశారు. 2008లో లిబియా వెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ బలరామ్ కిషన్ ఇంగ్లిష్ ప్రొఫెసర్. 2009లో అక్కడికి వెళ్లారు. ఇద్దరు ప్రతి ఏటా సెలవుల్లో హైదరాబాద్ వచ్చి వెళ్లేవారు. అలా 2015 జూలై 29న అక్కడి నుంచి వస్తుండగా కిడ్నాపయ్యారు. 414 రోజుల తర్వాత విడుదలయ్యారు.