కదంతొక్కిన నిరుద్యోగులు
నాంపల్లి: తెలంగాణలో నిరుద్యోగుల అవస్థలు గమనించి వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మానవతారాయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం నాంపల్లి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటును దాటుకుని లోనికి దూసుకెళ్లారు. చైర్మన్ కార్యాలయంలోనికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
నిరుద్యోగులు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో జరిగిందన్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. మన పక్కన ఉన్న ఏపీలో ఇప్పటికే డీఎస్సీని విడుదల చేసిందని గుర్తు చేశారు.
తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులు వయసు మీద పడి అవకాశాలను అందుకోలే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. అలాగే కాంట్రాక్టు విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నెలరోజుల్లోగా అన్ని ఉద్యోగాలకూ ప్రకటనలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు జె.కళ్యాణ్, భీమ్‌రావ్ నాయక్, డోలంకి శ్రీనివాస్, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులపై కేసులు తగదు
అఫ్జల్‌గంజ్: విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జె.నిరంజన్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం మాని... శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం.. నాన్‌బెయిల్‌బుల్ కేసులు బనాయించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
సోమవారం విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠి చార్జి చేయడం, వరంగల్ ముఖ్యమంత్రికి సమస్యలను వివరించడానికి వెళ్లిన 12 మంది విద్యార్థులపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తున్న ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.