ఆబద్దం ఆడను, నిజాన్ని బయటపెడతా..
న్యూఢిల్లీ : త్వరలోనే వాస్తవాలను బయటపెడతానని ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కాగా ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ కీలక నిందితుడిగా ఆరోపిస్తున్న జెరూసలెం మత్తయ్య ప్రమేయానికి సంబంధించి సరైన సాక్ష్యాలు లేవని పేర్కొన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆయన పేరును చార్జిషీటు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు నిర్ణయంతో విభేదించిన తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్కు కౌంటర్ దాఖలుకు తనకు కొంత సమయం కావాలని మత్తయ్య ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మత్తయ్య తరఫు న్యాయవాది అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా మత్తయ్య ఓ ప్రెస్నోట్ విడుదల చేశారు. ప్రాణభయంతో ఢిల్లీ వచ్చానని, అబద్ధం ఆడనని, నిజాన్ని త్వరలో బయటపెడతానని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ద్వారా తాను నమ్మిన దేవుడు న్యాయం చేస్తాడని మత్తయ్య పేర్కొన్నారు. తనకు ప్రాణహాని జరిగితే మొదటి ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని , అలాగే కేసీఆర్ కూడా బాధ్యుడేనని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన అన్నారు.
చంద్రబాబు తనను అవసరానికి వాడుకున్నారని, నీకేం కాదు..తాను ఉన్నానని చెప్పారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని మత్తయ్య ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో తాను అమాయకుడినని ఆయన తెలిపారు. తనను ఎ4 గా చిత్రించి, దేశ ప్రధాన న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టేందుకు ఆంధ్రా,తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగుదేశం, టిఆర్ఎస్లు ఆడుతున్న చదరంగంలో జెరుసలెం మత్తయ్య అను నన్ను బలిపశువును చేసి, ఇరు రాష్ట్రాలలో నా కులస్థులకు, మతస్థులకు అర్దం కాని చిక్కుల్లో పడేస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు బాగోతం , చంద్రశేఖరరావు చలోక్తులు, రాజకీయాలకే పరిమితం కాకుండా, తనలాంటి సామాన్యుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ముద్దాయిగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు జోలపడి నీకేం కాదు.. అని ధైర్యం చెప్పినట్లు నటించారని, ఇరువురు తన పరిస్థితిని అగమ్యగోచరం చేశారని, దీనిని ప్రజలే తీర్పు చెప్పాలని ఆయన అన్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని అన్నారు. సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉందని మత్తయ్య అన్నారు. ప్రజాకోర్టులో నిలబడి తనకు న్యాయం జరిగేవరకూ పోరాడతానని తెలిపారు. తనకు, కుటుంబసభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ జాతీయ మానవహక్కుల కమిషన్ లో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టులో కౌంటర్ వేశాక తనలో దాగిన నిజాలు పత్రికా ముఖంగా తెలియచేస్తానని మత్తయ్య చెప్పారు.