
సాక్షి, హైదరాబాద్: కుల వృత్తులకు పూర్వ వైభవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణ యువతీ యువకులకు వృత్తినైపుణ్యంలో శిక్షణ అనంతరం సోమవారం సచివాలయంలో వారికి కిట్లు, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారని, అందులో భాగంగా ప్రతికులానికి భారీ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారన్నారు.
అందులో భాగంగానే నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.250 కోట్లు కేటాయించారన్నారు. తొలివిడత కింద 138 మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చామన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో నాయీ బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యంకోసం రూ.20 కోట్లు కేటాయించామన్నారు. శిక్షణ పొందిన 138 మంది నాయీ బ్రాహ్మణ యువతీ, యువకులు భవిష్యత్తులో ఆత్మగౌరవంతో తమ కాళ్లపై నిలబడేలా తయారు చేశామన్నారు. రానున్న బడ్జెట్‌లో బీసీ వర్గాల బడ్జెట్ రెట్టింపు కానుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.5,070 కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.1,250 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వసతిగృహ సంక్షేమాధికారుల సంఘం క్యాలెండర్‌ను మంత్రి జోగు రామన్న ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment