సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి | Journalist union leaders warning | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి

Published Tue, Aug 23 2016 4:14 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి - Sakshi

సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి

- జర్నలిస్టు యూనియన్ నేతల హెచ్చరిక
- సంపూర్ణ మద్దతు ప్రకటించిన పార్టీలు
- హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ధర్నా
 
 సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించ కుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వంటావార్పు, ధర్నాలు చేయటం... రోడ్డెక్కడం, బజారులోకి రావడం జర్నలిస్టుల అభిమతం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులు కోరుతున్నట్లుగా అందరికి అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద   హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌జేయూ), టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ధర్నా, బైఠాయింపు కార్యక్రమాన్ని నిర్వహించింది. సాయంత్రం వరకు జరిగిన జర్నలిస్టుల ఆందోళనలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్, టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్ బాబు, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృత సాగర్, ప్రధాన కార్యదర్శి వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు డీజీ నర్సింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, నాయకురాలు పద్మ, రైతు జేఏసీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో పలు సందర్భాల్లో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు పర్చాలని విజ్ఞప్తి చేశారు. కొంత మంది జర్నలిస్టు నాయకులు ఎర్ర బుగ్గ కార్లు, పదవుల ఎరకు, కవర్లకు లాలూచి పడి తోటి జర్నలిస్టులను మోసం చేయవద్దని పేర్కొన్నారు. రెండేళ్లయినా అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇవ్వకపోవటంతో పాటు తెలంగాణ వస్తే ఇళ్లు వస్తాయని ఆశించిన జర్నలిస్టులకు నిరాశ ఎదురుకావటంతో తప్పని పరిస్థితుల్లో ఆందోళనలు చేయాల్సి వచ్చిందని ఐజేయూ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

పోలీసులతో తన్నులు పడైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుంటామని సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మెసేజ్ ద్వారా, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఫోన్ ద్వారా జర్నలిస్టుల న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గోపిరెడ్డి సంపత్‌కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యదర్శి నరేందర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలి, చంద్రశేఖర్ మాట్లాడారు. కాగా జర్నలిస్టుల సమస్యలపై అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడే వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించి నిరసన తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement