తెలంగాణ అంటే మట్టి కాదు
ఇక్కడ అన్ని వర్గాల ప్రజలూ బతకాలి
- చేనేత కార్మికుల పోరాటం న్యాయమైనది: కోదండరాం
- భూదాన్ పోచంపల్లిలో ‘చేనేత శంఖారావం’
భువనగిరి: ‘‘తెలంగాణ అంటే మట్టి, కొండలు, గుట్టలు, నదులు కాదు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు బతకాలి. తెలంగాణ వస్తే దాని ఫలాలు అందరికీ దక్కాలని భావించాం. కానీ గ్రామాల్లోకి వెళ్లి చూస్తే చేనేతతో పాటు కులవృత్తులు అధ్వాన పరిస్థితుల్లోకి వెళ్లాయి. చేనేత కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటం న్యాయమైంది. ఐదు జిల్లాల్లో రెండు లక్షల మంది ఒక్క చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారు పడుతున్న అవస్థలపై సీరియస్‌గా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపాలి’’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.
శుక్రవారం నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన చేనేత శంఖారావం బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చేనేత సంఘాల నాయకులు ఐక్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో చేనేత పరిశ్రమ అటకెక్కలేదని తెలియాలని.. ఈ మేరకు పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. తెలంగాణకు గుర్తింపు, గౌరవం పోచంపల్లి, నారాయణపేట, గ ద్వాల, గొల్లభామ చీరెలు, వరంగల్ కార్పెట్లు, మహదేవ్ టస్సార్ చీరలేనన్నారు. ఉపాధి హామీ పథకంలో కొకూన్స్ ఏరడానికి హామీ ఇవ్వాలని కోరినా.. ఇంతవరకు హామీ దక్కలేదన్నారు. చేనేత పరిశ్రమ పరిరక్షణకు తెలంగాణ జేఏసీగా తమ వంతు కృషి చేస్తామన్నారు. ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలూ చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. చేనేత పరిరక్షణ కోసం జేఏసీ అన్ని వర్గాలను కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులను సాధించుకుంటామన్నారు.
ప్రభుత్వం మెడలు వంచి ప్యాకేజీ సాధిస్తాం: ఉత్తమ్
వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం మెడలు వంచి చేనేత కార్మికుల అభివృద్ధికి ప్యాకేజీని ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఒక్కటి కూడా పట్టించుకోలేదన్నా రు. చేనేత కార్మికుల న్యాయమైన సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చేనేత కార్మికుల ఆందోళనలకు తమ మద్దతు ఉంటుందన్నారు. చేనేత రంగ సమస్యలపై ముఖ్యమంత్రిక బహిరంగ లేఖ రాస్తానన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆలిండియా హ్యాం డ్లూమ్ బోర్డు మెంబర్ కర్నాటి ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు.