విలీన దినోత్సవంపై స్పష్టత ఇవ్వాలి
రాష్ట్రానికి జూన్ 2 ఎంతో సెప్టెంబర్ 17 కూడా అంతే: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాై టైన జూన్ 2కి ఎంత ప్రాధాన్యముందో.. హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనమైన సెప్టెంబర్ 17కు కూడా అంతే ప్రాధాన్యముందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. విలీన దినోత్సవం సందర్భంగా శనివారం జేఏసీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్రోహ దినమని న్యూడెమొక్రసీ, విమోచన దినమని బీజేపీ అంటున్నాయని.. దీనికి ప్రభుత్వం స్పష్టత ఇచ్చి వివాదానికి తెరదించాలని కోదండరాం సూచించారు. అన్ని కోణాల్లో చర్చించాక విలీనదినోత్సవంగా నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించిందన్నారు. అనంతరం జిల్లాల విభజనకు సంబంధించి జేఏసీ నేతలు సీసీఎల్‌ఏకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు వెంకటరెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, సత్యం గౌడ్, భైరి రమేశ్ పాల్గొన్నారు.
రాష్ర్టంలో పాలన అస్తవ్యస్తం..
రాష్ట్రంలో నిర్ణయాధికారం కేంద్రీకృతమైందని ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, వెద్యం ఎవరికీ అందుబాటులో లేవన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తమైంద న్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాలను ఏర్పాటు చేసుకుంటూపోతే.. రేపు మరొకరు అధికారంలోకి వస్తే వారి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటారని పేర్కొన్నారు.