'అక్కడి అభివృద్ధి కాలనీల్లో కనిపించదేం'
'అక్కడి అభివృద్ధి కాలనీల్లో కనిపించదేం'
Published Sat, Apr 1 2017 5:23 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
హైదరాబాద్ : మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో కనిపించే వేగవంతమైన అభివృద్ది కాలనీలు, బస్తీలలో కనిపించదెందుకని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. బహుళజాతి సంస్థలను నెలకొల్పే ప్రాంతాలలో చూస్తుండగానే ఊహకందని రీతిలో అభివృద్ది పనులు పుంజుకుంటాయనంటూ అదే తరహా అభివృద్ది కాలనీలలో కూడా విస్తరిస్తే బాగుంటుందని అన్నారు.
బాలాపూర్ మండలంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు బాలాపూర్ చౌరస్తాలో స్థానిక బీజేపీ నాయకుడు కొలను శంకర్‌రెడ్డి చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోజురోజుకూ పెరుగుతున్న నగరీకరణ కొన్ని ప్రాంతాలకే కేంద్రీకృతం కావడంతో శివారున ఉన్న కాలనీలలో అభివృద్ది బొత్తిగా కనిపించడం లేదన్నారు. ఇందుకోసం కాలనీ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు, లయన్స్ క్లబ్ వంటి సేవా సంస్థలు ఐక్యంగా కదలాలని పిలుపునిచ్చారు. నాణ్యత ప్రమాణాలపై నమ్మకం కుదరని కారణంగా ఇప్పటికీ ప్రజలు ప్రైవేట్ విద్యా సంస్థలను ఆశ్రయిస్తున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు. గురుకులాలు, కేంద్రీయ విద్యాలయాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా, బాలాపూర్ మండలంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలతోపాటు ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొలను శంకర్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
Advertisement