అభివృద్ధి ఒకే ప్రాంతంలో వద్దు
అభివృద్ధి ఒకే ప్రాంతంలో వద్దు
Published Wed, Jan 25 2017 11:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
– సీమలో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలి
– పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి
– ముగిసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
కర్నూలు (టౌన్): అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయవద్దని, అలా చేస్తే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సూచించారు. స్థానిక వెంకటరమణ కాలనీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యం క్రమంలో 2018 నాటికి పూర్తి చేయాలన్నారు. తద్వారా 24 లక్షల ఎకరాలకు స్థిరీకరణ ఏర్పడుతుందన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని.. గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. సిద్దేశ్వరం వద్ద అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీమ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య మాట్లాడుతూ.. లైమ్‌స్టోన్, బైరెటిస్, ఐరన్‌ఓర్, నాపరాతి గనులు వంటి ఖనిజ సంపదకు సీమ ప్రాంతం పుట్టినిల్లు అన్నారు. ఫ్యాక్షన్ నేపథ్యం పేరుతో రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటు చేయకపోవడం మంచి పరిణామం కాదన్నారు. ఓర్వకల్లులో పరిశ్రమల కోసం 30 వేల ఎకరాలు కేటాయించినా.. అక్కడ ఒక్క పరిశ్రమ రాలేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. సోలార్ ప్లాంటు కోసం 5 వేల ఎకరాలు కేటాయించినా యువతకు ఒరిగిందేమిలేదన్నారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, పార్టీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు శాంత రెడ్డి, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement