2019 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
2019 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
Published Fri, Dec 30 2016 9:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
మోదీ సహకారంతోనే ముందుకు వెళ్తున్నాం
పోలవరం కోసం ప్రార్థనలు చేయండి
అమరావతి వచ్చాం.. దశ మారింది
ముఖ్యమంత్రి చంద్రబాబు
పోలవరం ప్రాజెక్ట్ కాంక్రీట్ పనులకు శ్రీకారం
భారీగా జనం తరలింపు
బీజేపీ కేంద్ర మంత్రులు దూరం
బీజేపీ నేతలకు అందని ఆహ్వానం
సభకు వెళ్లవద్దంటూ కమలనాథులకు ఎస్‌ఎంఎస్‌లు
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు :
పోలవరం ప్రాజెక్ట్ పనులను 2019 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో స్పిల్ వే కాంక్రీట్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పోలవరం పూర్తయ్యే వరకూ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ప్రార్థనలు చేయాలని కోరారు. కాంక్రీట్ పనులను వచ్చే డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని చెప్పారు. డయాఫ్రం వాల్ పనులను జనవరి 7న, రేడియల్ గేట్ల ఏర్పాటు పనులను సంక్రాంతి రోజున ప్రారంభిస్తామని చెప్పారు. 2018 నాటికి రెండు కాల్వలకు నీరు ఇస్తామని, 2019కి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతికి వచ్చిన తర్వాత దశ మారిందని, అందువల్లే అన్ని పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతున్నాయన్నారు. ఇది ఒక చరిత్ర అని, దీన్ని తిరగరాయడం కోసం ఇక్కడ సమావేశం అయ్యామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రంలో కరువు ఉండదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, ఎం.వెంకయ్యనాయుడు, ఉమాభారతి, పి.అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి సహకారం వల్లే పోలవరం కల నెరవేరుతోందన్నారు. గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందన్నారు. ఆనాడు ఎక్కడో పుట్టిన కాటన్‌దొర ఇక్కడి ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించిపోయి పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని ఆలోచన చేశారని, డబ్బులు లేక ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారన్నారు. దీంతో ఉభయగోదావరి జిల్లాలు సస్యశ్యామలం అయ్యాయని, అందుకే ఆయనను మానవ రూపంలో ఉన్న దేవునిగా ఈ జిల్లాల ప్రజలు కొలుస్తున్నారని చెప్పారు. గత 150 సంవత్సరాలుగా కాని పనికి ఈ రోజున శ్రీకారం చుట్టామన్నారు. 1940లో మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదించినా ముందుకు పోలేదని, 1980లో ఇంటర్‌స్టేట్ ట్రిబ్యునల్ అదేశాలు ఇచ్చినా అడుగు ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా పెట్టినా నిర్మాణంపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
భద్రాచలంలోని ఏడు ముంపు మండలాలను కలపలేదు.
ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమా«ణ స్వీకారం చేసిన సమయంలో తాను ఢిల్లీ వెళ్లి భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఇవ్వకపోతే తాను ప్రమాణ స్వీకారం మానేస్తానని గట్టిగా చెప్పానన్నారు. దీంతో మోదీ మొదటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ తెచ్చి, ఆమోదం పొందిన తర్వాతే పార్లమెంట్ సమావేశాలు పెట్టారని గుర్తు చేశారు. ఆ రోజు ఏడు మండలాలను కలపకపోతే పోలవరం ప్రాజెక్ట్ శాశ్వతంగా కలగా ఉండిపోయేదన్నారు. నీటి సమస్య చాలా సున్నితమైనదని, కావేరిలో 15 టీఎంసీల కోసం సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా రెండు రాష్ట్రాలు గొడవపడిన పరిస్థితిని చూశామన్నారు. తాను 12 సార్లు ప్రాజెక్ట్‌కు వచ్చానని, ప్రతి సోమవారం సమీక్షలు చేశానన్నారు. ’పుష్కరాల సమయంలో గోదావరి తల్లిని నీ చల్లని చూపుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కోరాను. లోక కల్యాణం కోసం నేను చేస్తున్న ప్రయత్నాలకు ఉభయగోదావరి జిల్లా ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారు’ అన్నారు. అమరావతికి 35 వేల ఎకరాల భూమిని ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన రైతులకు తాను రుణపడి ఉంటానన్నారు. పోలవరం కరుణిస్తే రాష్ట్రంలో కరువు ఉండదన్నారు. పోలవరంలో లక్షా 80 వేల మంది నిర్వాసితులు ఉన్నారని, 222 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. 2013 కొత్త చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తామని, పునరావాసం కల్పిస్తామన్నారు. ఎవరికీ నష్టం చేయమన్నారు. నిర్వాసితులు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లని, వారికి ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం చేయనని ప్రకటించారు. ప్రాజెక్ట్ కోసం భూములు ఇస్తున్న నిర్వాసితులకు పాదాభివందనం చేస్తున్నట్టు చెప్పారు. పట్టిసీమకు జిల్లా రైతులు సహకరించడం వల్లే కృష్ణా డెల్టాలో 55 టీఎంసీల నీటితో ఎన్నడూ లేనివిధంగా పంట పండిందన్నారు. రాష్ట్రంలో నీటి భద్రత కోసం వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని, నదుల అనుసంధానం చేస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేలోగా పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పూర్తి చేసి విశాఖ వరకూ నీరు ఇస్తామన్నారు.
పర్యటనలో అపశ్రుతి
ముఖ్యమంత్రి సభ కోసం వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున జనాన్ని ఆర్టీసీ, స్కూల్ బస్సులలో తరలించారు. తణుకు నుంచి డ్వాక్రా మహిళలతో వస్తున్న బస్సు పోలవరం ప్రాజెక్ట్ దగ్గరలో అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కొవ్వూరు వ్యవసాయ అధికారి వేణుగోపాల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఏఈవో రాంబాబు గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలకు గాయాలు కావడంతో వారిని అసుపత్రికి తరలించారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్షతగాత్రులను పరామర్శించారు.
కేంద్ర మంత్రులు దూరం
పోలవరం స్పిల్‌వే కాంక్రీట్ పనుల ప్రారంభం కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఉమాభారతి, ఎం.వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభు వస్తారని ప్రజలను భారీగా తరలించారు. ఇటీవలే రూ.1,981 కోట్లను నాబార్డు నుంచి రుణంగా ఇవ్వడంతో వారిని సభకు ముఖ్యమంత్రే స్వయంగా ఆహ్వానించి వచ్చారు. అయితే వీరెవరూ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులకు ఆహ్వానం లేకపోవడంతో వారు ఈ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ బీజేపీ శ్రేణులకు ఎస్‌ఎంఎస్‌లు పంపినట్టు సమాచారం.
పాదాభివందనాలు
ఈ సభకు హాజరైన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని అపర భగీరథుడు, అభినవ కాటన్ అని పొగడ్తలతో ముంచివేయడమే కాకుండా పాదాభివందనాలు చేయడానికి పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Advertisement