రూ.4687 కోట్ల బకాయిలు చెల్లించాం: కేసీఆర్
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఆయన గురువారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇచ్చారు. ఫీజు బకాయిలపై విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.4687 కోట‍్ల ఫీజు బకాయిలు చెల్లించిందని కేసీఆర్ వెల్లడించారు. మార్చి 31లోపు 2015-16 బకాయిలు పూర్తిగా చెల్లిస్తామన్నారు. పెద్దనోట్ల రద్దును తాను సమర్థించిన మాట వాస్తవమేని కేసీఆర్ అన్నారు. ఈ చర్య భవిష్యత్‌లో కచ్చితంగా దేశానికి మేలు జరుగుతుందన్నారు.
కాగా ఈరోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ పట్టుబట్టాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్‌పై చర్చించేందుకు ప్రభుత‍్వం సిద‍్ధంగా ఉందని, విపక్షాలు ఎన్ని ప్రశ‍్నలు అడిగినా క్లారిఫికేషన‍్లు ఇచ్చేందుకు సిద‍్ధమన్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ‍్వలేదనడం సరికాదని, రికార్డులు చూస‍్తే ప్రతిపక్షాలే ఎక్కువ సమయం తీసుకున‍్నట్లు తెలుస‍్తుందని చెప్పారు.
ఫీజు రీయింబర్సుమెంట్ విషయమై ప్రభుత‍్వం కట్టుబడి ఉందని, అందువల‍్ల సభాముఖంగా వారికి మనోధైర‍్యం ఇద్దామన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ విషయంలో చర్చించేందుకు ప్రభుత‍్వానికి భేషజం లేదని, అయితే సభ‍్యుల హక్కు అయిన ప్రశ్నోత్తరాలు అయిన వెంటనే విపులంగా చర్చిద్దామని ముఖ‍్యమంత్రి సూచించడంతో విపక్ష సభ‍్యులు శాంతించారు.