బాబూ.. నీ నెత్తుటి ముద్రలు అలాగే ఉన్నాయి | kcr slams chandra babu naidu over election campaign remarks | Sakshi
Sakshi News home page

బాబూ.. నీ నెత్తుటి ముద్రలు అలాగే ఉన్నాయి

Published Sat, Jan 30 2016 8:16 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

బాబూ.. నీ నెత్తుటి ముద్రలు అలాగే ఉన్నాయి - Sakshi

బాబూ.. నీ నెత్తుటి ముద్రలు అలాగే ఉన్నాయి

హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా తన ముద్రలు ఉన్నాయని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బషీర్‌బాగ్‌లో రైతులపై ఆయన కాల్పులు జరిపించారని, ఆ నెత్తుటి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వచ్చిన కేసీఆర్ కుడి చేతికి.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇతర పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయని, అనేక త్యాగాలు, పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని ప్రయాణాన్ని ప్రారంభించిదన్నారు. ఈ సమయంలో జరుగుతున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, ఓటు వేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలని కోరారు. యూపీఏ సర్కారు తెలంగాణ ఇవ్వడానికి హైదరాబాద్‌పై రాజీ పడతారా అని అడిగిందని, ఈ విషయంలో ఏ కొంచెం రాజీపడినా 2006 నాటికే తెలంగాణ వచ్చేదని అన్నారు. గుండెకాయ లేని మొండెం ఇస్తామంటే తీసుకోడానికి తాము సిద్ధంగా లేమని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణనే ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు. అందుకే రాష్ట్ర సిద్ధికి పద్నాలుగున్నర సంవత్సరాలు పట్టిందన్నారు.

 

నిన్న మొన్న హైదరాబాద్‌లో తిరిగిన చంద్రబాబు లాంటివాళ్లు దాదాపు వచ్చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని కుట్రలు పన్ని అడ్డుకున్నారని, చివర్లో కూడా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నారని, ఇలాంటి తరుణంలో గట్టిగా నిలబడి, పోరాటం చేసి హైదరాబాద్‌తో సహా తెలంగాణ తెచ్చుకున్నట్లు చెప్పారు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో పని ఉందని, ప్రజలు అక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి అక్కడి బజారు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు బోలెడు బజార్లున్నాయని, హైదరాబాద్ బజారు మేమే ఊడ్చుకుంటామని చెప్పానన్నారు. తెలంగాణలో వచ్చే ఆదాయం ఇక్కడి ప్రజల అభివృద్ధికే ఖర్చుపెడుతున్నామని చెప్పారు. మన డబ్బు మనకే మిగులుతోంది కాబట్టి పింఛను వెయ్యి, 1500 చొప్పున ఇస్తున్నామన్నారు. ఏపీలో మనిషికి 4 కిలోల బియ్యం ఇస్తుంటే తెలంగాణలో 6 కిలోల బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు గానీ.. ఇక్కడ బ్రహ్మాండంగా కరెంటు సప్లై చేసుకుంటున్నట్లు తెలిపారు.

 

పరిశ్రమలకు కూడా కోత లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో రూ. 51 వేలు ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇంకా ప్రాజెక్టులు కట్టుకోవాలి, మంచినీళ్లు తెచ్చుకోవాలని.. చాలా సాధించాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు నాయుడు వచ్చి కితకితలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బల్దియాలో గులాబి జెండా ఎగిరితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగితే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మూసీనదిని మురికి, కంపు నదిగా మార్చిన ఘనత కాంగ్రెస్, టీడీపీలది కాదా అని ప్రశ్నించారు. మంచినీటి చెరువు హుస్సేన్ సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చింది కూడా వాళ్లేనన్నారు. పెద్దమనిషి అని తాను భావించిన దత్తాత్రేయ కూడా ఉల్టాపల్టా మాట్లాడుతున్నారన్నారు.

 

కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు కడతారని ఆయన అంటున్నారని.. కానీ కేంద్ర మంత్రిగా ఆయన నిజాయితీగా మాట్లాడాలని చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఈ పథకం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ముఖ్యమంత్రులు ఇలాంటి పథకం చేపట్టారా అని అడిగారు. చంద్రబాబుతో తిరిగి ప్రచారం చేశారని.. ఆయన పాలించే ఏపీలోనైనా డబుల్ బెడ్రూం స్కీం ఉందా అని నిలదీశారు. హైదరాబాద్ మీద ప్రేమ ఉందని, ఇక్కడే ఉంటానని చంద్రబాబు అంటున్నారు, ఆయన ముద్రలు అడుగడుగునా ఉన్నాయని అంటున్నారని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్‌ పోలీసు కాల్పుల్లో నలుగురు రైతులను కాల్చి చంపిన ముద్రలు ఇప్పటికీ ఉన్నాయని, అసెంబ్లీ ఎదుట అక్కచెల్లెళ్లను గుర్రాలతో తొక్కించిన ముద్రలు ఉన్నాయని, కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ ముద్ర వేసింది ఆయనేనని, దాన్ని తిప్పి వాళ్లను పర్మినెంటు చేసి వాళ్ల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పెట్టుబడి దారులకు అండగా నిలబడి కార్మికుల కడుపు కొట్టారని మండిపడ్డారు.

నారాయణకు ఎవరైనా చెవి కోస్తే ఆస్పత్రిలో చేర్చాలి..


సీపీఐ నాయకుడు నారాయణ గురించి కూడా ఆయన పలు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ సొంతబలంతో గెలిస్తే తాను చెవికోసుకుంటానని ఆయన అన్నారంటూ.. ''5వ తేదీన హైదరాబాద్‌లో ఉండకు.. ఎవరైనా చెవి కోస్తే ఈఎన్‌టీ దవాఖానలో చేర్పించాలి'' అన్నారు. ఇప్పుడు కూడా చెవి కోసుకుంటా, కాలు కోసుకుంటానన్న బేల ముచ్చట్లు ఎందుకని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో కూడా కొందరు చెవి కోసుకుంటా, మెడ కోసుకుంటా.. ఇంకేవో కోసుకుంటామన్నారని, 2వ తేదీన ఎవరెవరికి ఏం కోయాలో ప్రజలే చూసుకుంటారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement