నిప్పుకణికల్లాంటి వీసీలను పెడతా: కేసీఆర్
హైదరాబాద్: యూనివర్సిటీలకు సరైన పాలకులు లేకపోవడం వల్లే వాటి పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. ఆ పరిస్థితిని మార్చేందుకు నిప్పుకణికల్లాంటి వైఎస్ ఛాన్సలర్లను తీసుకురావాలనుకుంటున్నామని, యూనివర్సిటీకు పూర్వవైభవం తీసుకురావాలని అనుకుంటున్నామని చెప్పారు. ఆదివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల స్పందనకు ఆయన ధీటుగా సమాధానం ఇస్తూ పలు అంశాలు ప్రస్తావించారు.
యూనివర్సిటీల తీరుపై మాట్లాడుతూ కిస్ ఫెస్టివల్‌లాంటివి ఇండియాలో నడుస్తాయా అని ప్రశ్నించారు. వర్పిటీల్లో అసలు ఫెస్టివల్లు ఎందుకు నిర్వహిస్తున్నారని, వాటితో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. అలాంటి పరిస్థితులు మార్చేందుకే పవర్ ఫుల్ వీసీలను తీసుకురావాలనుకుంటున్నామని, త్వరలోనే వారి నియామకం జరుగుతుందని అన్నారు. హైకోర్టు సీజే పోసాలేను ఏదైన వర్సిటీకి వీసీగా ఉండాలని కోరినట్లు చెప్పానన్నారు.
ఆ స్థాయి వ్యక్తులు వీసీలయితే తప్ప వర్సిటీలు బాగు పడవని అన్నారు. రోహిత్ వేముల, జేఎన్ యూ ఘటనలు దురదృష్టకరమని, వాటిని ఖండిస్తున్నామని చెప్పారు. వర్సిటీలకు సరైన పాలకులు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతిఏటా బీ ఎడ్ కాలేజీల నుంచి 40వేలమంది బయటకు వస్తున్నారని, ఉద్యోగాలు ఎలా ఇవ్వాలని అన్నారు. ఇంజినీరింగ్ పిల్లలు హోమ్ గార్డులుగా పనిచేస్తున్నారని ఇది దయనీయమని అన్నారు. అడ్డగోలుగా గత ప్రభుత్వాలు కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ వ్యవస్థను సమూలంగా మారుస్తామని, ఆలస్యం అయిన మంచి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.