- ఇబ్రహీంను ఉగ్రబాట పట్టించింది ఇతడే
- 2015లో సిరియాలో మృతి
- ఇలియాస్ రాడికలైజ్ అయింది వేలూరులో
- ‘మీ సేవ’ యజమానికి ఎన్‌ఐఏ నోటీసులు..
- వాంగ్మూలం నమోదు
సాక్షి, హైదరాబాద్ : ఐసిస్‌కు అనుబంధమైన ఏయూటీ మాడ్యుల్ హైదరాబాద్‌లో తయారు కావడానికి మూలం జోర్డాన్‌కు చెందిన వ్యక్తా... దీనికి ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వర్గాలు. ఈ మాడ్యుల్ చీఫ్ ఇబ్రహీం యజ్దానీ సహా మిగిలిన నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్తున్నాయి.
మలుపు తిప్పిన సహోద్యోగి పరిచయం
పాతబస్తీకి చెందిన యజ్దానీ 2003లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నగరంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన ఇతగాడు 2011లో సౌదీ అరేబియాలోని జెద్దా వెళ్లి అక్కడి ఎలక్ట్రికల్ కంపెనీలో చేరాడు. అప్పట్లో ఇతడి సహోద్యోగిగా ఉన్న జోర్డాన్ వాసితో పరిచయం ఇబ్రహీం జీవి తాన్ని మలుపుతిప్పింది. జోర్డాన్, సిరియా ల్లో జరుగుతున్న ‘యుద్ధం’, అక్కడి పరిస్థితుల్ని ఇబ్రహీంకు వివరించిన జోర్డాన్‌వాసి ఆ మార్గం వైపు ఆకర్షించాడు. 2014 వరకు జెద్దాలోనే ఉన్న ఇబ్రహీం.. ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఇంటర్నెట్‌ను ఆశ్రయించాడు. ఇబ్రహీం తొలినాళ్లల్లో బ్లాగ్స్‌తో పాటు ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ‘ఓపెన్ ఫోరమ్స్’లో ఓ వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి/దేశాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యల్ని అధ్యయనం చేసేవాడు.
సిరియా వెళ్లేందుకు ఇబ్రహీం యత్నం
జోర్డాన్ వాసి ఐసిస్‌లో పనిచేసేందుకు జెద్దా నుంచి సిరియా వెళ్లిపోయినట్లు ఇబ్రహీం తెలుసుకున్నాడు. అతడు గత ఏడాది చనిపోయాడు. ఈ విషయం జోర్డాన్‌వాసి సోదరుడు ఫేస్‌బుక్ లింక్ ద్వారా తనకు సమాచారం ఇచ్చినట్లు ఇబ్రహీం ఎన్‌ఐఏ అధికారులకు చెప్పాడు. ఈ పరిణామంతో పూర్తి ఉగ్రవాద బాటపట్టిన ఇబ్రహీం సిరియా వస్తానంటూ ఆన్‌లైన్ ద్వారా హ్యాండ్లర్‌ను కోరాడు. దీన్ని వ్యతిరేకించిన హ్యాండ్లర్ హైదరాబాద్‌లోనే ముఠా ఏర్పాటు చేసి ‘ఆపరేషన్స్’ చేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పాడు.
నిధుల కోసం నగల విక్రయం
తన సోదరుడితో పాటు పాతబస్తీ ప్రాంతానికే చెందిన మరికొందరితో కలసి రంగంలోకి దిగాడు. వీరందరితో ప్రమాణం చేయించిన ఇబ్రహీం.. కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన నిధుల కోసం అతడు తన సంబంధీకుల బంగారు ఆభరణాలను విక్రయించాడని వెల్లడైంది.
‘వల’ వేసి పట్టిన సిరియా హ్యాండ్లర్
ఆయా మాధ్యమాల్లో ఉన్న పోస్ట్‌లకు ఉద్రేకపూరితంగా స్పందిస్తున్న ఇబ్రహీంను గుర్తించిన సిరియాలో ఉన్న హ్యాండ్లర్ వ్యక్తిగతమైన ‘పేజ్’ల్లోకి ఆహ్వానించి తన భావజాల వ్యాప్తిని కొనసాగించాడు. ఇలా పూర్తిగా తన వల్లో పడిన తర్వాత ‘వాట్సాప్’, ‘హైక్’, ‘సిగ్నల్’, ‘ట్రిలియన్’, ‘స్కైప్’ సహా వివిధ రకాలైన యాప్స్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఏ సందర్భంలోనూ తన ఉనికి బయటపడకుండా జాగ్రత్త వహిస్తూ.. పూర్తిగా ఉచ్చులోకి లాగేశాడు. ఇబ్రహీం 2014లో జెద్దా నుంచి తిరిగివచ్చినా నెట్ ద్వారా హ్యాండ్లర్‌తో సంప్రదింపులు కొనసాగించాడు. ఇతడి సోదరుడైన ఇలియాస్ యజ్దానీ తమిళనాడులోని వేలూరులోని మదర్సాలో విద్యనభ్యసించాడు. అక్కడ పరిచయమైన కొందరి ద్వారా ఉగ్రవాద భావాలను నింపుకున్నాడు. దీంతో వీరిద్దరూ తరచుగా వివిధ రకాలైన ఉద్రేకపూరిత చర్చలు జరిపేవారు.
ఇబ్రహీం బంధువు వాంగ్మూలం నమోదు
ఇబ్రహీం ముఠా తమ కార్యకలాపాలకు తలాబ్‌కట్టలో షాలియార్ ఆన్‌లైన్ సేవ పేరుతో ఉన్న మీ సేవ కేంద్రాన్ని వినియోగించుకుంది. దీన్ని ఇబ్రహీం బావమరిదైన సంతోష్‌నగర్‌లోని ఈది బజార్ వాసి నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ మాడ్యుల్ తమ కుట్రల్ని చర్చించుకోవడానికి ఇందులోనే సమావేశమయ్యేది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాదనే ఉద్దేశంతోనే మీ సేవ కేంద్రాన్ని ఎంచుకుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడి కంప్యూటర్‌ను సైతం వినియోగించింది. దీని ద్వారానే ‘ప్రమాణ పత్రాలను’ తయారు చేయడంతో పాటు బోగస్ ధ్రువీకరణలు రూపొందించడానికి స్కానర్‌ను వాడినట్లు బయటపడింది. ఎన్‌ఐఏ విచారణలో ఇబ్రహీం, ఇలియాస్ ఈ విషయాలు బయటపెట్టడంతో మంగళవారం మీ సేవ కేంద్రంలో తనిఖీలు చేసిన అధికారులు కంప్యూటర్, స్కానర్ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డుల్లో ఒకటి ఇతడి పేరుతోనే ఉంది. దీంతో ఈ కేసులో అతడు కీలక సాక్షిగా మారాడు. శుక్రవారం అతడికి నోటీసులు జారీ చేసిన ఎన్‌ఐఏ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించి సాక్షిగా పరిగణిస్తూ వాంగ్మూలం నమోదు చేశారు.
జెద్దాలో కలసిన జోర్డాన్‌వాసి!
Published Sat, Jul 9 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement