కట్టుబొట్టు మార్చిన అయ్యవార్లు!
- ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కొందరు అర్చకుల తీరు
- తలపై శిఖ, నుదుట తిలకం మాయం, ధోవతి బదులు లుంగీధారణ
- కొన్ని ఆలయాల తనిఖీల్లో వెలుగులోకి
- కమిషనర్‌కు అధికారుల నివేదిక
- అన్ని ఆలయాలకు త్వరలో నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : తలపై శిఖ (పిలక), నుదుటన నామాలు, గోచీతో కూడిన ధోవతి... ఆలయ అర్చకులంటే కనిపించే రూపం ఇది. దేవునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్తలైన అయ్యవార్లు పవిత్రత, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. కానీ ఇప్పుడు ఆ రూపులో తేడాలు కనిపిస్తున్నాయి. చాలా దేవాలయాల్లో అర్చకులు ఆగమశాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా ధోవతికి బదులు లుంగీలు ధరించడమే కాకుండా పిలక కూడా పెట్టుకోవడం లేదని అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన దేవాదాయశాఖ...చట్టంలో పొందుపరిచిన అర్చకుల ప్రవర్తనా నియమావళిని పాటించని అన్ని దేవాలయాలకు నోటీసులు పంపాలని నిర్ణయించింది.
నియమావళికి విరుద్ధంగా...
ఇటీవల కొందరు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలను తనిఖీ చేయగా అర్చకుల వేషధారణలో మార్పులు రావటాన్ని గుర్తించారు. ముఖ్యంగా వారికం టూ ప్రత్యేకంగా చట్టంలో పొందుపరిచిన ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటాన్ని గమనించారు.
దేవాదాయ చట్టంలోని సెక్షన్ 13లో ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం అర్చకులు విధిగా శిఖ పెట్టుకోవడంతోపాటు గోచీతోకూడిన ధోవతి, పైపంచె, నుదుటన ఆలయ ఆగమానికి తగ్గట్టుగా తిలకం ధరించాల్సి ఉంది. కానీ చాలా మంది అర్చకులు శిఖను ఉంచుకోవటం లేదని అధికారులు గుర్తించారు. కొందరు కనీసం కుంకుమ కూడా పెట్టుకోవడం లేదని, గోచీతో కూడిన పంచెకు బదులు లుంగీ కట్టుకుంటున్నారని గమనించారు. అలాగే ఆలయంలో దేవతావిగ్రహాలపై ఉంచిన పూలను మరుసటి రోజు (నిర్మాల్యం) తొలగించటం లేదని గుర్తించారు. ముఖ్యంగా అర్చకులు ధూమపానం, జర్దా, తంబాకు, గుట్కా వంటి దురలవాట్లకు లోను కాకూడదని దేవాదాయశాఖ చట్టం చెబుతున్నా కొందరు అర్చకులు మాత్రం పాన్‌మసాలా నములుతున్నట్టు అధికారులు కనుగొన్నారు.
ఇవి ఆలయ పవిత్రతకు భంగం కలిగించటమే కాకుండా భక్తుల మనోభావాలకు ఇబ్బందిగా ఉన్నాయని పేర్కొంటూ దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో చట్టంలో పేర్కొన్న అర్చకుల ప్రవర్తనా నియమావళిని, గతంలో ప్రభుత్వ ఉత్తర్వు రూపంలో జారీ చేసిన వివరాలను పొందుపరుస్తూ అన్ని దేవాలయాలకు శ్రీముఖాలు పంపాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమించిన అర్చకులపై చర్యలు తీసుకోవాలనుకుంటోంది.
కొన్ని ఆలయాల్లో అవినీతి...
హైదరాబాద్‌లో దాడులకు కుట్రపన్నిన ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవల అరెస్టు చేసి విచారించగా వారి హిట్‌లిస్టులో కొన్ని దేవాలయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆయా ఆలయాల వద్ద భద్రతను పరిశీలించేందుకు వెళ్లిన అధికారులకు అక్కడ జరుగుతున్న అవకతవకలు, అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు సమర్పించిన వాటి ఆధారంగా కమిషనర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ వినాయక ఆలయం లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయటంతోపాటు ఒకరికి రివర్షన్ ఆదేశాలు జారీ చేశారు.