కేసీఆర్ మాటిచ్చి మరిచారు: కోదండరాం
సుభాష్‌నగర్: అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొందని గుర్తుచేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘బోధన్‌లోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలనే డిమాండ్ ఇప్పటిది కాదని, ఉద్యమ సమయంలోనే నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ ప్రధానమైన అంశమన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని వేచి చూశాం. అలా కాని పక్షంలోనే ప్రత్యక్ష కార్యాచరణ అనివార్యమైంది. జిల్లా చరిత్రలో నిలిచిపోయే ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం’ అని పేర్కొన్నారు.