సాక్షి, హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లలో చలికి వణుకుతున్న పిల్లలకు కనీసం దుప్పట్లు ఇవ్వలేని ప్రభుత్వం.. సాగుకు 24గంటల విద్యుత్‌పై ఎందుకంత ఆసక్తి ప్రదర్శిస్తోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. స్కూళ్లు, హాస్టళ్లలో బాలికలకు కనీసం టాయిలెట్లను కూడా ప్రభుత్వం కట్టించ లేదని విమర్శించారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌పై వాస్తవాల పేరుతో సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్ ఉండటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీరిందని.. సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని వెల్లడించారు. అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్య పరిష్కరించామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
19 రాష్ట్రాల్లో కరెంట్ కోతలే లేవు..
దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభించడంతో ప్రస్తుతం అవసరానికి మించిన విద్యుత్ లభ్యత ఉందని కోదండరాం వెల్లడించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) 2017–18 వార్షిక నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 1,08,167 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2016–17 నుంచి కరెంట్ కోతలు లేవని వెల్లడించారు. రాష్ట్ర రైతులు కూడా 9 గంటల విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయమంటున్నారే తప్ప.. 24గంటల విద్యుత్‌ను కోరడం లేదన్నారు. సాగుకి 24గంటల విద్యుత్ కోసం విద్యుత్ సంస్థలపై ఏటా రూ.10 వేల కోట్ల భారం పడనుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.5,500 కోట్ల మేరకే భారాన్ని భరిస్తానంటోందని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ను ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని కోదండరాం ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment