- రైతుల కోసం 72 గంటల దీక్ష
హైదరాబాద్: నల్లగొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి తమ అన్నదమ్ముల వల్లనే గెలిచాడని సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం మాట్లాడుతూ.. పార్టీ మారిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో గుత్తాపై పోటీ చేసి ఓడిస్తానని సవాల్ చేశారు. బతుకుదెరువు కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడన, రోజుకో పార్టీ మారుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎంపీ పదవికి పుష్కరాల తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎందుకు మాట మారుస్తున్నాడని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణం కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టాలని సీఎం కేసీఆర్ చేసిన నిర్ణయం పిచ్చితుగ్లక్ చర్య అని వ్యాఖ్యానించారు. ఇటీవలనే నిర్మించిన డి-బ్లాక్‌ను కూలగొడతామనడం పిచ్చిపని అని, వాస్తు బాగుండకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి సీఎం కేసీఆర్ తప్పుకోవాలని సూచించారు.
పేదలు వైద్యం అందక, రుణమాఫీ లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేలకోట్లు పనులు ఇచ్చి, కమీషన్ల ద్వారా సీఎం కేసీఆర్ వేలకోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయడానికి, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వడానికి, పేదలకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడానికి, విద్యార్థులకు ఫీజును రీయింబర్సుమెంటు చేయడానికి నిధుల్లేవంటున్న సీఎం కేసీఆర్ విలాసాల కోసం దుబారా ఖర్చులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నాడని విమర్శించారు. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ కోసం నవంబరు మొదటివారంలో 72 గంటల దీక్ష చేస్తానని, పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని ఇందిరాపార్కువద్ద పోరాటానికి దిగుతానని కోమటిరెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న పిచ్చిపనుల్లో వంద అస్త్రాలు ప్రతిపక్షాలకు ఉన్నాయన్నారు.
మా దయ వల్లే గుత్తా గెలుపు- కోమటిరెడ్డి
Published Tue, Oct 18 2016 7:11 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement