కనిపించని పార్టీకి.. కనిపించని నేత
పవన్ కల్యాణ్‌పై బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కనిపించని పార్టీకి కనిపించని నాయకుడిగా తమ పార్టీ పరిగణిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రంపై, ప్రధాని మోదీపై ట్వీటర్ ద్వారా పవన్ ఆధార రహిత, డొల్ల ప్రకటనలు చేయడం గర్హనీయమన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షకు పాల్పడుతోందని ఆరోపణలు చేయడం పిల్లచేష్టల మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ నాయకులు ఎన్వీ సుభాష్, సుధాకర శర్మలతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రాంతీయతల ఆధారంగా బీజేపీ రాజకీయాలు చేస్తున్నట్లుగా పవన్ ఆరోపించడం... ఆయన రాజకీయ నిరుద్యోగాన్ని, మేధో దివాళాను స్పష్టం చేస్తోందన్నారు. అబద్ధాలు, ద్వేషంపై ఆధారపడిన ఇటువంటి అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ఉత్తరాది రాజకీయపార్టీలపై పోరుకు దక్షిణాది నాయకులు ఐక్యం కావాలంటూ ట్వీట్‌లో పవన్ పిలుపునివ్వడం మోసంతో కూడుకున్న మిథ్య అని పేర్కొన్నారు.
పవన్ ఓ ట్వీటర్ టైగర్ అని వ్యాఖ్యానించారు. పార్టీని ప్రారంభించి కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి మంత్రి పదవి తీసుకోవడాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో భాగస్వామి అయిన పవన్.. కాంగ్రెస్‌ను దక్షిణాది పార్టీగా పరిగణిస్తారా అని ప్రశ్నించారు. 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, తమ పార్టీ సుపరిపాలనకు సంబంధించి పవన్‌కల్యాణ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.