Krishnasagar Rao
-
న్యాయబద్ధంగా వ్యవహరించాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లో చేర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు డిమాండ్‌చేశారు. ఇంకా వారిని విధుల్లో చేర్చుకోకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా బెదిరింపు ధోరణితో వ్యవహరించడం అన్యాయం, అక్రమమని ఇలాంటి ధోరణిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమ్మెను ముగించినట్లు అధికారికంగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డారు. ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ విడుదల చేసిన ప్రకటన చూస్తే ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగులను విధులకు అనుమతించవద్దని డైరెక్షన్ ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. బలహీనమైన ఆర్టీసీ కార్మికులపై సీఎం తన అధికార బలాన్ని ప్రయోగించి ఇది తన విజయంగా ఆనందిస్తున్నారని దుయ్యబట్టారు. -
సీఎం క్షమాపణ చెప్పాలి: కృష్ణసాగర్ రావు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి దేవాలయాన్ని అపవిత్రం చేసి, హిందువుల మనోభావాలు గాయపరిచినందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మోకాళ్లపై వచ్చి క్షమాపణ చెప్పాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆలయ స్తంభాలపై సీఎం తన రూపాన్ని, పార్టీ చిహ్నాన్ని, ప్రభుత్వ పథకాలను చెక్కించుకున్న వైచిత్రి దేశ చరిత్రలో ఎక్కడా లేదని మండిపడ్డారు. వారంలోగా ఆయా స్తూపాలను దేవాలయాన్ని పరిరక్షించేవిగా, శాస్త్రానుగుణంగా మళ్లీ నిర్మించాలన్నారు. కేసీఆర్ నిర్వాకాన్ని తెలంగాణ ప్రజలు సహించరని, ఆయన చరిత్ర హీనులయ్యారని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. -
హిందువులకు కాంగ్రెస్ వ్యతిరేకం : బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : హిందువులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని, ఆ పార్టీ రామమందిర నిర్మాణానికి వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. పంజాబ్ మంత్రి సిద్ధూ దక్షిణ భారతదేశం కంటే పాకిస్తాన్ మేలని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హిందువులను అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆలయాల చుట్టూ తిరిగితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు హిందువులు చులకనగా కనిపిస్తున్నారని మండిపడ్డారు. రామమందిరంపై కాంగ్రెస్ వైఖరి ఏంటో వెల్లడించాలని కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దక్షిణ భారతీయులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. డిసెంబర్ ఏడు తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ దమననీతిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. -
‘పవన్‌ది భజన పార్టీ.. తెలంగాణ వ్యతిరేకి’
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో పెరియార్ స్ఫూర్తితో వస్తున్నానని చెప్తున్న పవన్ కల్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలు అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. ఆయన ప్రాంతీయవాదంతో పబ్బం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. జనసేన రాజకీయ పార్టీనా? బ్రోకరేజ్ సంస్థనా? అని ప్రశ్నించారు. ‘జనసేనకు కార్యవర్గం లేదు. లోగో, జెండా ఉన్నాయి కానీ డైరెక్షన్ లేదు. జనసేన సినిమా విడుదల కాకముందే ఫెయిల్ అయింది’ అని విమర్శించారు. పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, కేసీఆర్ కుటుంబంపై ఆయన అనేక వాక్యాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పవన్ పొగడడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ పార్టీ బీ టీం అని, అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీల్చడానికి టీఆర్ఎస్ ప్రయోగిస్తున్న అస్త్రంగా తాము భావిస్తున్నామని అన్నారు. పవన్ కల్యాణ్‌ది భజన పార్టీ అని, ఏపీలో చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్ పొగడడం అంటేనే.. ప్యాకేజీల పార్టీగా కనబడుతుందని విమర్శించారు. జనసేనలో కార్యకర్త లేరని, కేవలం అభిమానులతో పవన్ హడావిడి చేస్తున్నారని అన్నారు. ఏపీలో పెరుగన్నం తిని, తెలంగాణలో బిర్యానీ తినడం కాదు రాజకీయం అంటే అని అన్నారు. దేశంలోనే తెలంగాణలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగినా.. ఆ విషయమై ఎందుకు సీఎంను సంప్రదించలేదని ప్రశ్నించారు. పవన్ యాత్రకు దిక్కు మొక్కులేదని, ఆ యాత్రకు లక్ష్యం కూడా లేదని అన్నారు. ఆయన చేస్తున్న నినాదంలో అర్థం లేదని అన్నారు. మితిమీరి మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్! ‘నటుడు ప్రకాశ్ రాజ్ మితిమీరి మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రధాని మోదీ, అమిత్ షాలు హిందువులు కారంటే.. అర్థముందా.. గౌరీలంకేశ్ మృతి పట్ల స్పందించకపోతే.. మోదీ హిందువు కాదా’అని కృష్ణసాగర్ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ మతిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేరళలో 19 మంది ఆరెస్సెస్ యువకులు చనిపోతే.. నీకు బాధ అనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ ద్వేషంతో మాట్లాడుతున్నాడని అన్నారు. -
ఐలయ్య మూర్ఖుడు: కృష్ణసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కులం పేరుతో దూషించిన కంచ ఐలయ్య ఒక మూర్ఖుడు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమిత్ షాను కించపరిచేలా కంచ ఐలయ్య చేసిన వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆర్యవైశ్యులంటే చులకన భావముందని, అందుకే ఆర్యవైశ్యులను అవమానించినా పట్టించుకోవడంలేదని కృష్ణసాగర్‌రావు విమర్శించారు. ఐలయ్యపై ప్రభుత్వమే క్రిమినల్ కేసును ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలకు సిద్ధాంతాల్లేవని.. ఉనికిని కాపాడుకోవడానికే హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. -
కేసీఆర్ ఎనిమిదో నిజాం
బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): సీఎం కేసీఆర్ ఎనిమిదో నిజాంలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పాలన నిజాం నిరంకుశ పాలనను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌రావు విమర్శించారు. శనివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. నేడు తెలంగాణకు 70వ స్వాతంత్య్ర దినోత్సవం అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడాన్ని ముస్లింలు కూడా వ్యతిరేకించడం లేదని, మైనార్టీల ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో టీఆర్ఎస్ అధికారికంగా నిర్వహించడంలేదని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ రాంరెడ్డి పాల్గొన్నారు. -
ఆనాడు ప్రశ్నించింది కేసీఆర్ నోరే కదా!
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో నిజాం పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్ ఎనిమిదో నిజాం మారిదిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి దిగిన బీజేపీ నేత కిషన్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. కిషన్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. చరిత్రను వక్ర్రీకరిస్తే చరిత్ర హీనులవుతారు... కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ ఆనాడు రోశయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కేసీఆర్ నోరే కదా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం తెచ్చుకోలేదా అని అడిగారు. 'ఆత్మ గౌరవం అంటే ఓట్లు కాదు. ముస్లింలు కూడా వ్యతిరేకించడం లేదు. మైనారిటీ ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందన్న భయంతో టీఆర్ఎస్ అధికారికంగా సెప్టెంబర్ 17 ను జరపడం లేద'ని ఆరోపించారు. -
భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలి
బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోనే అతి పెద్ద భూ కుంభకోణం ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఆరోపించారు. ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యమైన మంత్రులకు ప్రమేయం ఉందని అన్నారు. అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మియాపూర్ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రమేయం ఉందని ప్రతికల్లో వార్తలు వస్తున్నా యన్నారు. ఈ కుంభకోణంతో కేసీఆర్‌కు సంబంధం లేకపోతే వెంటనే మహమూద్ అలీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో ఒక్క ఐఏఎస్ అధికారిని కూడా ఎందుకు బాధ్యుడిని చేయలేదని నిలదీశారు. -
టీఆర్ఎస్కు 10 సీట్లకు మించి రావు
బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా బలహీనపడిందని, అందుకే సర్వేల రూపంలో సీఎం కేసీఆర్ బలంగా ప్రచారం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. మంగళవారం ఆయన పార్టీ నేత సుధాకరశర్మతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్కు పది సీట్లకు మించి రావని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. విపక్షాలు బోగస్ అంటూ సీఎం మాట్లాడుతున్నారని, కాని కేసీఆరే అసలు బోగస్ అన్నారు. కేసీఆర్ అసమర్థ పాలన వల్ల అన్ని వ్యవస్థలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయని, మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్‌గా మారిందని ఆరోపించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సీఎంగా కేసీఆర్ స్థాయికి తగదన్నారు. -
రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు
హరీశ్‌పై బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభు త్వంపై మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తు న్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ధ్వజమెత్తారు. హరీశ్ చెప్పిన లెక్కలన్నీ తప్పులతడకగా, కేంద్రంపై అసత్య ప్రచారానికి తెర తీసేవిగా ఉన్నాయని శుక్రవారం విమర్శిం చారు. కేంద్రం ఎఫ్ఏక్యూ రకం మాత్రమే కొనుగోలు చేయాలని ఎక్కడా చెప్పలేదని, ఈ పేరుతో హరీశ్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేసిన హరీశ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిర్చి దిగుబడి ఫిబ్రవరి, మార్చికల్లా వస్తుండగా, ఆలస్యంగా మార్చి 30న మార్కెట్ ఇంటర్వేన్షన్ స్కీం (ఎంఐఎస్) కింద ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.3 వేల బోనస్ ప్రకటించాలని, ఎంఐఎస్ కింద కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
కనిపించని పార్టీకి.. కనిపించని నేత
పవన్ కల్యాణ్‌పై బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కనిపించని పార్టీకి కనిపించని నాయకుడిగా తమ పార్టీ పరిగణిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రంపై, ప్రధాని మోదీపై ట్వీటర్ ద్వారా పవన్ ఆధార రహిత, డొల్ల ప్రకటనలు చేయడం గర్హనీయమన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షకు పాల్పడుతోందని ఆరోపణలు చేయడం పిల్లచేష్టల మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ నాయకులు ఎన్వీ సుభాష్, సుధాకర శర్మలతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాంతీయతల ఆధారంగా బీజేపీ రాజకీయాలు చేస్తున్నట్లుగా పవన్ ఆరోపించడం... ఆయన రాజకీయ నిరుద్యోగాన్ని, మేధో దివాళాను స్పష్టం చేస్తోందన్నారు. అబద్ధాలు, ద్వేషంపై ఆధారపడిన ఇటువంటి అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ఉత్తరాది రాజకీయపార్టీలపై పోరుకు దక్షిణాది నాయకులు ఐక్యం కావాలంటూ ట్వీట్లో పవన్ పిలుపునివ్వడం మోసంతో కూడుకున్న మిథ్య అని పేర్కొన్నారు. పవన్ ఓ ట్వీటర్ టైగర్ అని వ్యాఖ్యానించారు. పార్టీని ప్రారంభించి కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి మంత్రి పదవి తీసుకోవడాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో భాగస్వామి అయిన పవన్.. కాంగ్రెస్‌ను దక్షిణాది పార్టీగా పరిగణిస్తారా అని ప్రశ్నించారు. 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, తమ పార్టీ సుపరిపాలనకు సంబంధించి పవన్‌కల్యాణ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.