
ఈ వార్తను కొందరు పనిగట్టుకుని రాసినట్లుంది
హైదరాబాద్ : మెదక్ ఉప ఎన్నిక ఫలితాన్ని తొక్కిపెట్టేందుకే మెట్రో రైలు ప్రాజెక్ట్ను వివాదం చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తారని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. మెట్రోపై ఎల్అండ్టీ లేఖ రాసినట్లు మీడియాలో చూసినట్లు కేటీఆర్ అన్నారు. ఈ వార్తను కొందరు పనిగట్టుకుని రాసినట్లు ఉందని ఆయన విమర్శించారు.
మరోవైపు తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్ట్ వివాదంపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని, కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్అండ్టీ లేఖ పాతదేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. కావాలనే కొంతమంది దీనిపై వదంతులు సృష్టిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.