పనులు పరిగెత్తాల్సిందే!
వంద రోజుల కార్యాచరణ ప్రణాళికపై సమీక్షలో కేటీఆర్
♦ 58 రోజులు ముగిశాయి.. ఇక మిగిలింది 42 రోజులే..
♦ జలమండలి కార్యాచరణలో 50 శాతం పనులే పూర్తి
♦ వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేపట్టిన పనులను గడువులోగా పూర్తి చేసేందుకు ఆయా విభాగాలు కఠినంగా ప్రయత్నించి లక్ష్యాలను పూర్తి చేయాల్సిందేనని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో ప్రతి భవనానికి వర్షపునీటిని భూమిలోకి ఇంకించే ఇంకుడు గుంత లేకపోతే భవన నిర్మాణ అనుమతి, నల్లా కనెక్షన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో కీలకమైన జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వంద రోజుల్లో ఇప్పటికే 58 రోజులు ముగిశాయని.. ఇక మిగిలింది 42 రోజులేనని.. వర్షాకాలం రాకముందే మంచినీరు, మురుగునీటి అవస్థలను తీర్చే పనులను మే చివరి లోగా పూర్తిచేయాలని సూచించారు. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో 50 శాతమే పూర్తయ్యాయని.. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. బుధవారం సైఫాబాద్‌లోని మెట్రో రైలు భవన్‌లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆయన ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి...
మొదటి టౌన్‌హాల్ మీటింగ్‌కు సంబంధించి వెంటనే ప్రణాళిక రూపొందించాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. వర్షాకాల ప్రణాళికను వేసవిలోనే పూర్తి చేయాలని, వర్షపు నీరు నిలిస్తే కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లు ఎందుకూ పనికి రాకుండా పోతాయని హెచ్చరించారు. వరద నీటి నిర్వహణ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వర్షాకాల ప్రణాళిక వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్డు కమిటీలను త్వరలోనే పూర్తిచేస్తామని కమిషనర్ జనార్దన్‌రెడ్డి మంత్రికి తెలిపారు.
గ్రేటర్ పరిధిలో పది అధునాతన శ్మశాన వాటికల అభివృద్ధి కోసం చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. నగరంలోని అన్ని పార్కులు, క్రీడా మైదానాల్లో ఇంకు డు గుంతల నిర్మాణం చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో నగరానికి తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాలను ప్రజలు పొదుపుగా వాడుకోవాలని మంత్రి సూచించారు. జలమండలి పైపులైన్ పనుల కారణంగా దెబ్బతిన్న రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద నగరంలో వినియోగదారులు హెచ్‌ఎండీఏకు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారం త్వరలో పూర్తవుతుంద ని మంత్రి తెలిపారు.