దేశమంతా బీ‘పాస్‌’ అనాలి | Telangana: Minister KTR Review On Municipal Sector | Sakshi
Sakshi News home page

దేశమంతా బీ‘పాస్‌’ అనాలి

Published Tue, Dec 28 2021 3:49 AM | Last Updated on Tue, Dec 28 2021 5:01 AM

Telangana: Minister KTR Review On Municipal Sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ సహా పట్టణాల్లో భవన నిర్మాణ, లేఅవుట్‌లకు సరళతర అనుమతుల కోసం అమలు చేస్తున్న టీఎస్‌–బీపాస్‌ విధానాన్ని సైతం టీఎస్‌–ఐపాస్‌ తరహాలో దేశానికే ఆదర్శంగా నిలిచే వ్యవస్థగా మార్చాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల మేరకు తెచ్చిన ఈ చట్టంలో పేర్కొన్న అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్‌ ప్రాజెక్టులు, అభివద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌–బీపాస్‌ విధానం క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం అమల్లో తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమంగా వాటిని అధిగమించినట్లు అధికారులు వివరించారు.

ప్రస్తుతం టీఎస్‌–బిపాస్‌ను పౌరులు ఉపయోగిస్తున్న తీరును గణాంకాలతో సహా తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎస్‌–బీపాస్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసేలా వెబ్‌సైట్‌లో మార్పులు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతం, టోల్‌ ఫ్రీ నంబర్‌కు విస్తృత ప్రచారం వంటి చర్యలను చేపట్టాలని అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 

పట్టణ ప్రగతితో పురోగతి... 
ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు, అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాల పురోగతి గురించి కేటీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పట్టణ ప్రగతి కోసం ప్రతి నెలా పురపాలికలకు ప్రత్యేక నిధులను అందించేందుకే టీయూఎఫ్‌ఐడీసీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తద్వారా ఆయా పట్టణాల్లో పౌర, మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేయగలుగుతున్నట్లు వివరించారు. 

మాస్టర్‌ ప్లాన్‌ల తయారీలో వేగం పెంచండి... 
రాష్ట్రంలోని పురపాలికల్లో మాస్టర్‌ ప్లాన్‌ల తయారీపై మంత్రి కేటీఆర్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో మాస్టర్‌ ప్లాన్‌లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మాస్టర్‌ ప్లాన్‌ల తయారీ ప్రక్రియ ఇప్పటికే అనేక పురపాలికలు, అన్ని కార్పొరేషన్లలో పూర్తయిందని అధికారులు వివరించారు.

మరోవైపు ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధి లోపల పురపాలక శాఖ తరఫున కొనసాగిస్తున్న తాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సైతం కేటీఆర్‌ సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ వంటి అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ వారంలోనే ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మరో రెండు ఫ్లైఓవర్‌లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్, పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, టౌన్‌ ప్లానింగ్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement