హైదరాబాద్: పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ అంచనాల మీద తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం రాజేంద్ర నగర్లో ఆయా శాఖాదిపతులతో జరిగిన సమావేశంలో బడ్జెట్ తీరు తెన్నుల మీద కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
పంచాయితీరాజ్ శాఖకు మూసపద్దతిలో బడ్జెట్ అంచనాలు తయారు చేయకుండా అవసరాలకి అనుగుణంగా, తమ సామర్ధ్యం మేరకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు రాబోయే మూడు సంవత్సరాలకు ఉండాల్సిన విజన్ సైతం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఇందులో భాగంగా ఎంచుకున్న ప్రాధాన్యతల మేరకు ఈ సంవత్సరం కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా అధికారులు.. పంచాయితీరాజ్ రోడ్లు ఇంజనీరింగ్ శాఖ బడ్జెట్ అంచానాలను కేటీఆర్‌కు వివరించారు. గత బడ్జెట్ లో ఎన్ని నిధులు ఖర్చు చేశారు. ఈ సారి ఎంత ఖర్చు ఉండబోతుందన్న అంశంపైన ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సారి బ్రిడ్జీల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ప్రతి గ్రామ పంచాయితీకి బిటి రోడ్డు కనెక్టీవిటి ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పంచాయితీరోడ్లను అవసరం ఉన్న చోట్ల విస్తరించాలన్నారు. ఇక రోడ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఘానాన్ని వాడుకోవాలని, ఇందులో భాగంగా బైటెక్ కోల్డ్ మిక్స్, అర్‌బిఐ 81 వంటి సాంకేతిక పరిజ్ఞానాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలన్నారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పనులు డిజిటలైజ్ చేసేందుకు పంచాయితీరాజ్ అన్ లైన్ మానిటరింగ్ టూల్ రూపకల్పన ద్వారా పర్యవేక్షణకి సైతం ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆర్‌డబ్ల్యూయస్ అండ్ యస్ శాఖ ప్రతిపాదనలను సమీక్షించారు. ఈసారి ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మిషన్ భగీరథకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో అధికంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఇక తాగునీటి సరఫరా, స్వచ్చ భారత మిషన్, ఎన్‌ఆర్‌డీడబ్ల్యూ వంటి వాటికి కేంద్రం నుంచి వచ్చే నిధులపైన మంత్రి అధికారులనుంచి వివరాలు తీసుకున్నారు. ఇక స్వచ్చ్ తెలంగాణలో (ఎస్‌బీఎమ్) భాగంగా ఏడు లక్షల 55 వేల టాయిలెట్స్ నిర్మాణానికి సైతం.. ఈసారి గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.