కూచిపూడి కళాకారుడికి కుచ్చుటోపీ | kuchipudi dancer sudhakar reddy was cheated by cyber criminals, hyderabad cyber crime police registered case | Sakshi
Sakshi News home page

కూచిపూడి కళాకారుడికి కుచ్చుటోపీ

Published Fri, Dec 18 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

కూచిపూడి కళాకారుడికి కుచ్చుటోపీ

కూచిపూడి కళాకారుడికి కుచ్చుటోపీ

- బంగారు నగలు ఎరగా వేసి రూ.7.5 లక్షలు కాజేసీన సైబర్ నేరగాళ్లు

సాక్షి, సిటీబ్యూరో:
ఆయనో కూచిపూడి నత్య కళాకారుడు. దేశదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి పేరు తెచ్చుకున్నారు. సొంతంగా వెబ్‌సైట్ ఏర్పాటుచేసుకుని అందులో తన ప్రదర్శన వివరాలు, సంప్రదింపుల కోసం ఫోన్ నంబర్లు ఉంచారు. అదే ఆ కళాకారుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. సైట్ లో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ చీటింగ్ ముఠా ఆయనపై వలపన్నింది. బంగారు నగలు అమ్ముతామంటూ ఎరవేసి, ఆపై కేసులంటూ భయపెట్టి, చివరికి పన్నుల పేరుతో రూ.7.5 లక్షల కాజేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రై మ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన సుధాకర్‌రెడ్డి కూచిపూడి నత్య కళాకారుడు. యువతిగా అలంకరించుకుని అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన ఆయన పలు బహుమతులు, అవార్డులు సైతం పొందారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతో ఇంటర్‌నెట్‌లో సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. అందులో తన కాంటాక్ట్ నెంబర్ కూడా పొందుపరిచారు. ఇదిలా ఉండగా సుధాకర్‌రెడ్డికి దాదాపు నెల రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది. తాము లండన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన అవతలి వ్యక్తులు.. వెబ్‌సైట్‌లో ఫొటోలు, వీడియోలు చూశామంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

పుత్తడిబొమ్మలా ఉండి, అద్భుతంగా నత్యం చేస్తున్న మీతో యూకేలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని, అలంకరించుకోవడానికి కొన్ని నగలు పంపిస్తామని ఎరవేశారు. దీంతో కాస్త కంగుతిన్న సుధాకర్‌రెడ్డి... తాను పురుషుడినని, నగలు ఎందుకంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ మాట వినటంతోనే సర్దుకున్న అవతలి వ్యక్తులు... తాము కళాకారులకు పంపుతున్నామని, ఇందులో స్త్రీ, పురుష భేదం లేదంటూ సరిచేసుకున్నారు. యూకేలో ఈవెంట్ పేరుతో కొన్ని రోజుల పాటు ఫోన్లు, వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిగాయి. యూకేలో జరిగే ఈవెంట్‌లో తాము ఇచ్చిన నగలనే ధరించి నత్యం చేయాలంటూ నమ్మబలికారు. ఓ రోజు హఠాత్తుగా నగలతో పాటు ఆ బాక్సులో 35 వేల పౌండ్లు సైతం పెట్టి పంపించామంటూ సుధాకర్‌రెడ్డికి వర్తమానం పంపారు. ఇది జరిగిన మరుసటి రోజే కస్టమ్ అధికారిణి అంటూ ఓ యువతి ఫోన్ చేసింది. మీకు లండన్ నుంచి నగలతో పాటు కొన్ని పౌండ్లతో కూడిన పార్శిల్ వచ్చిందని చెప్పింది.

పన్నుల పేరుతో అందినకాడికి...
ఈ రకంగా విదేశాల నుంచి అక్రమంగా రావడం కస్టమ్స్ నిబంధనలకు విరుద్ధమని, ఈ నేపథ్యంలోనే మీపై కేసు నమోదు చేయనున్నామంటూ భయపెట్టింది. అలా కాకుండా ఉండాలంటూ దాదాపు రూ.కోటి విలువైన నగదు, పౌండ్లకు సంబంధించి రూ.4.5 లక్షల పన్ను కట్టాలంటూ ఓ బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పింది. ఆందోళనకు లోనైన సుధాకర్‌రెడ్డి ఆ మహిళ చెప్పినట్లు నగదు డిపాజిట్ చేశారు.

ఆ తరవాత మళ్ళీ సంప్రదించిన యువతి ఎఫ్‌బీఐ, ఆర్బీఐ క్లియరెన్స్‌ల పేరుతో మరో రూ.3 లక్షల వరకు దఫదఫాలుగా డిపాజిట్ చేయించుకుంది. చివరకు సమాధానం సైతం లేకపోవడంతో తాను మోసపోయినని గుర్తించిన బాధితులు శుక్రవారం సైబర్ క్రై మ్ ఏసీపీ ఇస్మాయిల్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఉత్తరాదికి చెందిన నైజీరియన్ల పనిగా అధికారులు భావిస్తున్నారు. ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement