మునిగిపోయే నావ ఎవరెక్కుతారు? | kurnool district ysrcp mlas deny joining TDP | Sakshi
Sakshi News home page

మునిగిపోయే నావ ఎవరెక్కుతారు?

Published Sun, Feb 21 2016 2:41 AM | Last Updated on Tue, May 29 2018 2:33 PM

kurnool district ysrcp mlas deny joining TDP

వైఎస్సార్‌సీపీని వీడం... జగన్‌తోనే ఉంటాం తేల్చి చెప్పిన కర్నూలు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: మునిగే నౌకలాంటి తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన అవసరం తమకెంత మాత్రం లేదని కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేకతతో సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ యత్నా లు దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని పునరుద్ఘాటించారు.

కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, గుమ్మనూరు జయరామయ్య, యక్కలదేవి ఐజయ్యలు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీని వీడుతున్నట్లుగా కొన్ని చానెళ్లు, పత్రికలు అదే పనిగా శుక్రవారం ఉదయం నుంచీ చేస్తున్న ప్రచారమంతా సీఎం చంద్రబాబు ‘మైండ్‌గేమ్’ లో భాగమని వారు తెలిపారు. ఈ వార్తలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తమ పేర్లు పెట్టి  వార్తలు ప్రసారం చే యడానికి, ప్రచురించడానికి ముందు తమతో మీడియా ప్రతినిధులు సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటామని, ఆయన నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రకటించారు. ఇక్కడకు రాని కొందరు ఎమ్మెల్యేలు జిల్లాల్లో తమపై వచ్చిన  ప్రచారాలను ఖండిం చారన్నారు. భూమా నాగిరెడ్డికి తమ పార్టీ సముచిత ప్రాధాన్యతనిచ్చిందని, ప్రతిపక్షానికి వచ్చే ఏకైక అధికార పదవైన పీఏసీ చైర్మన్ పదవిని ఆయనకే ఇచ్చామని ఎస్వీ, బుడ్డాలు  చెప్పారు. అంతకుముందు వారంతా పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలుసుకుని, జిల్లా సమస్యలను చర్చించారు. ఎమ్మెల్యేలవివరణ ఇలా...

 జగన్‌తో  సాన్నిహిత్యం ఉంది: ఎస్వీ
 మేమంతా వైఎస్సార్‌సీపీ గుర్తు మీదే గెలిచాం. జగన్‌తో సాన్నిహిత్యం, ఆయన నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉన్నాయి. మేం పార్టీని వీడం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనందువల్ల ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత పెరుగుతూ ఉంది. పైగా ఆ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకు పోయింది. అందువల్ల ఇలాంటి ప్రచారాలను లేవదీస్తున్నారు. టీవీ చానెళ్లు కూడా వాళ్లకు నచ్చిన లక్కీ నెంబర్లతో ఇంతమంది, అంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారని ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. మీడియా వారికి ఒకటే విజ్ఞప్తి... దయచేసి ఇలాంటివేవైనా మీ దృష్టికి వచ్చినపుడు మాకు ఫోన్లు చేసి ఎంతవరకు నిజమో అడిగి తెలుసుకోండి.

 దుష్ర్పచారం దారుణం: ఎమ్మెల్యేలు
 తమకు సంబంధం లేకుండానే కొన్ని చానెళ్లు తమ ఫోటోలతో సహా టీవీల్లో చూపిస్తూ పార్టీ వీడుతున్నట్లు ప్రసారం చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర రెడ్డి, జయరామయ్య,  ఐజయ్య, గౌరు చరితలు అన్నారు. తామంతా ఎట్టి పరిస్థితుల్లో నూ  జగన్ నేతృత్వంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అధికార పక్షంచేస్తున్న కుయుక్తులు తమవద్ద చెల్లవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement