'కృష్ణా డెల్టాకు నీరందించడం కోసమే పట్టిసీమ'
కర్నూలు : అధికార పార్టీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రజలకు ఒరిగేది ఏం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమలోని నదులను అనుసంధానం చేస్తే.. రాయలసీమ సస్యశ్యామలం అవుంతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రాజెక్టు కేవలం కృష్ణా డెల్టాకు నీరందించడం కోసమే కానీ, రాయలసీమకు ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానమనేది అప్పట్లోనే కాటన్ దొర ప్రారంభించినప్పటికీ.. టీడీపీ ప్రభుత్వం బడాయి కోసమే ఈ నదుల అనుసంధానమని వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
శ్రీశైల జలాశయం నీటిమట్టం 854 అడుగులకు చేరక ముందే నీటిని వదిలి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో డబ్బులకు ఆశపడి వ్యవహరిస్తున్నారని కర్నూలు జిల్లా పరిషత్లో నదుల అనుసంధాన సదస్సులో పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే మండిపడ్డారు. రాయలసీమకు న్యాయం జరగాలంటే పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమించాలంటూ ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలకు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.