గోదావరి జిల్లాల్లో మూడో పంట కోసమే పట్టిసీమ
గోదావరి జిల్లాల్లో మూడో పంట కోసమే పట్టిసీమ
Published Tue, Feb 21 2017 10:41 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
పట్టిసీమలోని అవినీతినే వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించింది
– సీమ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గుంటూరు, గోదావరి జిల్లాల్లో మూడో పంటకు నీరు ఇవ్వడం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారని, ఈ విషయాన్ని ముందు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ చెబుతుంటే ఎవరూ నమ్మలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలులోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం స్వయంగా సీఎం చంద్రబాబునాయుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడో పంటకు నీరు ఇవ్వాలని, జూన్‌లో రైతులు నారు పోసుకునేందుకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మేక తోలు కప్పిన పులిలాంటి వారని, ఆయన నైజమే మోసమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, ఇన్నాళ్లు పట్టిసీమ ప్రాజెక్టును గోదావరి జలాలను రాయలసీమకు వినియోగించడం కోసం నిర్మిస్తున్నామని చెప్పి ఇక్కడి రైతుల్లో ఆశలు రేకెత్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టిసీమ ప్రాజెక్టుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అవినీతినే తమ పార్టీ ప్రశ్నించిందన్నారు. మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన ప్రాజెక్టుకు రూ.1600 కోట్లు ఖర్చు చేయడం దారుణమన్నారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడం చూస్తే ఈ ప్రాంత ప్రజలపై వారికున్న అభిమానం ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు, కొడుమూరు సమన్వయకర్తలు హఫీజ్‌ఖాన్, మురళీకృష్ణ, కేంద్ర పాలిక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement