Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి? | Rayalaseema west constituency graduates MLC election analysis | Sakshi
Sakshi News home page

పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?.. వైఎస్సార్‌సీపీకి సానుకూలాంశాలు ఇవే..

Published Fri, Jan 6 2023 2:57 PM | Last Updated on Fri, Jan 6 2023 4:04 PM

Rayalaseema west constituency graduates MLC election analysis - Sakshi

రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో తొలి అంకం ముగిసింది. గత నెల 30న తుది ఓటరు జాబితా ఖరారైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్‌ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రధాన పారీ్టలైన వైఎస్సార్‌ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో పాటు ఆశావహులు ప్రచారపర్వంపై దృష్టి సారించారు. ఆరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లతో సమావేశమవుతున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.  – సాక్షి ప్రతినిధి కర్నూలు

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డిల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ వీటి భర్తీకి ఉపక్రమించింది. ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు విస్తృత ప్రచారంలో తలమునకలవుతున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులతో.. యూనియన్ల వారీగా, శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. పట్టభద్రుల కోటాలో 3,28,807 ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో 2.52లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే 76వేల ఓట్లు అధికం. పెరిగిన ఓట్లు ప్రభుత్వ పనితీరును, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ 
వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ‘అనంత’ నుంచి పోటీ చేస్తోన్న బీసీ నాగరాజు మధ్య ప్రధాన పోటీ ఉండే అకాశం ఉంది. వీరితో పాటు బోరంపల్లి ఆంజనేయులు, గైబున్నీసా, బోయ నాగరాజు, పట్టుపోగుల పవన్‌ కుమార్‌తో పాటు పలువురు పోటీలో ఉన్నా, పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నపూస రవీంద్రారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తనయుడు కావడం సానుకూలాంశం. రాంగోపాల్‌రెడ్డి పులివెందుల నియోజవకర్గ వాసి. ఎవ్వరికీ తెలియని వ్యక్తి! రవీంద్రారెడ్డి అభ్యరి్థత్వాన్ని ఆరు జిల్లాలలోని 26మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్‌చార్జీలు ఏకగ్రీవంగా సమర్థించారు. బాధ్యత తీసుకుని గెలుపునకు కృషి చేస్తున్నారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఓడిపోయామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభావం తప్పదని, పోటీ వద్దని టీడీపీ ఇన్‌చార్జీలు భావించారు.

గత ఎన్నికల్లో ప్రతిపక్ష పారీ్టగా వైఎస్సార్‌సీపీ ఉండి ఎమ్మెల్సీ గెలిచిందని, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కనీసం పోటీ చేయకుంటే ఆ ప్రభావం కేడర్‌పై బలంగా పడుతుందని నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. పోటీకి అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాంగోపాల్‌రెడ్డిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో తెలిసిందే. అక్కడ టీడీపీకి ఎలాంటి విజయాలు లేవు. అలాంటి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలపడం చూస్తే ఈ ఎన్నికలను టీడీపీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. రవీంద్రారెడ్డి 28 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలుస్తున్నారు. రాంగోపాల్‌రెడ్డి చంద్రబాబు పర్యటనలో మినహా ఎక్కడా కనిపించని పరిస్థితి. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి అనుకూల అంశాలు
►సచివాలయాల ఏర్పాటుతో వేలాది నిరుద్యోగులకు సర్కారు కొలువులు. 
►ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్‌ చేయడం. 
►పోలీస్‌రిక్రూట్‌మెంట్‌ ద్వారా 6,900 పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు. 
►అభ్యర్థుల వినతి మేరకు వయస్సు సడలింపు నిర్ణయం. 
►న్యాయశాఖ పరిధిలో 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీ 
►గ్రూప్‌–1 నోటిఫికేషన్‌కు చర్యలు. 
►వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలన్నీ భర్తీకి నిర్ణయం. 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోనూ త్రిముఖ పోరే.. 
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 27,716 ఓట్లు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఓట్లు కూడా పెరిగాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు బీజేపీ నేత ఒంటేరు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు పోటీ చేస్తున్నారు. కత్తి, ఒంటేరు, రామచంద్రారెడ్డి మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. కత్తి ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయ ఎన్నికల్లో యూనియన్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థి గెలుపోటములను యూనియన్లే ప్రభావితం చేయనున్నాయి. దీంతో అభ్యర్థులంతా యూనియన్ల నేతలు, సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement