కార్మిక హక్కుల రక్షణే లక్ష్యం
సమగ్రాభివృద్ధికే ప్రధాని తపన
కార్మికుల సంక్షేమానికి ఎన్నో కొత్త పథకాలు
బండారు దత్తాత్రేయ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కార్మిక హక్కులను పరిరక్షిస్తూ వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రదర్శన, అవగాహన కార్యక్రమంలో దత్తాత్రేయ ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ నినాదంతో .. వర్గం, ప్రాంతం అని తేడా లేకుండా దేశ సమగ్రాభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విధానాలు, పథకాల పట్ల ప్రజల్లో అవగాహనకు తొలుత ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇప్పుడు హైదరాబాద్‌లో తర్వాత లక్నో, పట్నా నగరాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్మిక శాఖలో చేపట్టిన మార్పు లు, ప్రవేశపెట్టిన పథకాలపై దత్తాత్రేయ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికులు దేశంలో దాదాపు 52 కోట్లకు పైగా ఉన్నారని, వారి సామాజిక భద్రత కోసం ప్రభుత్వం కార్మికులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. కార్మికుల సంక్షేమానికై చట్టాల్లో కొన్ని మార్పు లు తీసుకు రావాల్సిన అవసరం ఉందని, ఇది కార్మికులకు, పరిశ్రమల యాజమాన్యాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు.
అప్రెంటిస్ స్టైపెండ్ పెంపు
గత ప్రభుత్వంలో ఏడాదికి అప్రెంటిస్ ద్వారా 2 లక్షల 80 వేల మందికి శిక్షణ ఇప్పించేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో వచ్చే రెండేళ్లలో ఏడాదికి 20 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నామని గతంలో ఇచ్చే స్టైపెండ్ రూ.2,400 నుంచి రూ.4,900కు పెంచుతున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులు ఏపీలో రూ.792 కోట్లు, తెలంగాణలో రూ. 190 కోట్లు ఉందని, ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి త్వరలో పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. అంతకు ముందు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి ప్రారంభించారు.
తెలంగాణలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు
ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్’ని ‘మోడల్ ఎక్స్ఛేం జ్’గా తయారు చేసి ‘‘నేషనల్ కేరీర్ కౌన్సి ల్ సెంటర్’’గా మార్చడం. తెలంగాణలో ని ఏ జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేం జ్‌లో రిజిస్టర్ చేసుకున్నా సదరు వ్యక్తి మొ బైల్ నంబర్‌కు ఉద్యోగావకాశాల వివరాలను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా చేరవేయడం.
తెలంగాణలోని బీడీ కార్మికుల సంక్షేమం కోసం వారి పిల్లలకు ఉపకార వేతనాల కింద రూ.9,30,56,210 మంజూరు. మొబైల్ వ్యాన్‌ల ద్వారా గ్రామాల్లోని వారికి హెల్త్ చెకప్‌లు
బీడీ కార్మికులు ఇళ్లనిర్మాణం చేపడితే ఇకపై రూ.1లక్ష ఇచ్చేందుకు నిర్ణయం.
సిరిసిల్లలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ. 70 కోట్లు మంజూరు
సనత్‌నగర్ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలకు కృషి
నాచారం ఈఎస్‌ఐకి రూ.253 కోట్లు
వరంగల్ ఈఎస్‌ఐ ఆస్పత్రి రిపేర్ల కోసం రూ. 4 కోట్ల 50 లక్షలు మంజూరు
తెలంగాణ రాష్ట్రంలోని డిస్పెన్ససరీలకు రూ. 40 కోట్లు మంజూరు
గోషామహల్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన
ముషీరాబాద్ ఐటీఐని అప్‌గ్రేడ్ చేయడానికి కృషి