కాంగ్రెస్‌ది దివాళాకోరు రాజకీయం: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఉద్యమాలు చేయడం.. ఆ పార్టీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శిం చారు. కాంగ్రెస్ పార్టీ చర్యలు నల్లకుబేరులకు మద్దతు తెలిపే విధంగా, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శిం చారు. నల్లధనం, అవినీతి నిర్మూలన, నకిలీ నోట్ల చెలామణిని అరికట్టేందుకు తీసు కున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారని, వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నా లను కాంగ్రెస్ మానుకోవాలని హెచ్చరించారు.
బొగ్గు, 2 జీ, కామన్‌వెల్త్ క్రీడల్లో కుంభకోణాలకు పాల్పడి, లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ బాధంతా తాము దోచుకున్న, దాచుకున్న డబ్బుకు ఎసరు వచ్చినందుకేనని ఎద్దేవా చేశారు. బ్యాంకులు, ఏటీఎంల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగు సహాయాన్ని అందించాలని బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు.