వారికి అన్యాయం జరగకూడదనేది కేసీఆర్ ఆకాంక్ష
- ఉప్పల్ భగాయత్ రైతులకు ప్లాట్ల పత్రాల పంపిణీ
- ఇదే స్ఫూర్తితో ఓఆర్‌ఆర్‌లోనూ ల్యాండ్ పూలింగ్: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఎక్కడ ఆస్తులు సేకరించినా మానవీయ కోణంలోనే ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రైతులకు 2 రూపాయలు అదనంగా పోయినా ఫర్వాలేదు.. కానీ వారికి అన్యాయం జరగకూడదన్నదే స్వయంగా రైతు అయిన కేసీఆర్ ఉద్దేశం. అందుకనుగుణంగానే ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో సీలింగ్ భూములున్న రైతులకూ లబ్ధి పొందేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. వారి ఆనందమే ము ఖ్యం. అదే విధానాన్ని మిగతా ప్రాంతాల్లోనూ అనుసరిస్తాం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు.
ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియాలో సోమవారం 550 కు పైగా ఉప్పల్ భగాయత్ రైతులకు ప్లాట్ల పత్రాలను ఆయన పంపిణీ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప్పల్ భగాయత్ అంశం 12 ఏళ్ల నాటిదని, నలుగురు సీఎంలు మారినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పట్టా లున్న భగాయత్ రైతులకు ఎకరాకు 1,000 గజాలు ఇస్తే, సీలింగ్ రైతులకు 600 గజాలు ఇచ్చారని చెప్పారు. ఇన్నేళ్లు నిరీక్షించినందుకు ఈ రైతుల భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు దాదాపు రూ.35 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
మూసీకి పూర్వ వైభవం...
‘ఒకప్పుడు నగరానికి మణిహారంలా ఉన్న మూసీ నదికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రూ.3వేల కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నాం. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతీ నదిని ఆధునీకరించిన తీరును తెలుసుకునేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అక్కడ పర్యటించాం. అంతకన్నా గొప్పగా మూసీని ఆధునీకరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళతాం’ అని కేటీఆర్ చెప్పారు.
అంబర్‌పేట్, ఉప్పల్‌లో ఫ్లైఓవర్లు...
యాదగిరిగుట్టతో పాటు వరంగల్‌కు నిత్యం నగరం నుంచి వేలాది మంది వెళ్లివస్తుంటా రని, దీంతో ఉప్పల్‌పై ట్రాఫిక్ భారం పడుతోందని కేటీఆర్ చెప్పారు. ఈ మార్గాల్లో ఫ్లైఓవర్‌లు నిర్మించాలనుకుంటున్నామని, కేంద్రం రూ.950 కోట్లు మంజూరుచేసిందన్నారు. ‘అం బర్‌పేట్ చే నంబర్ చౌరస్తా నుంచి రామాంతపూర్ వరకు ఒక ఫ్లైఓవర్, ఉప్పల్ నుంచి నారపల్లి వరకు మరో ఫ్లైఓవర్ పనులను 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. ఆస్తుల సేకరణలో స్థానికులు సహకరించాలి. వారికి తగిన విధంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. అభ్యంతరా లుంటే మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకొంటాం. కోర్టులకు వెళ్లడం వల్ల దశాబ్దాల పాటు అభివృద్ధి పనులు నిలిచిపోతాయి’అని చెప్పారు. మాదాపూర్‌లో శిల్పారా మం మాదిరి గానే ఉప్పల్‌లోనూ మినీ శిల్పా రామం ఏర్పాటుకు ప్రయత్నిస్తానన్నారు.
యాదాద్రికి ఎంఎంటీఎస్...
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయా నికి ఎంఎంటీఎస్ రైలు వేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. నగరంలోని రూ.400 కోట్లతో 25 చెరువుల చుట్టూ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు వీకెండ్‌ల్లో కుటుంబ సభ్యులు అక్కడే సేదతీరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసీయుద్దీన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు పాల్గొన్నారు.
ఓఆర్‌ఆర్ చుట్టూ మినీ సిటీలు..
‘నగరానికే తలమానికమైన అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మినీ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అక్కడా ముందుకొచ్చే రైతులతో మాట్లాడి ల్యాండ్ పూలింగ్ చేపట్టాలనుకుంటున్నాం. ప్రయోగాత్మకంగా 2 చోట్ల ఈ పనులను త్వరలోనే హెచ్‌ఎండీఏ చేపడుతుంది. భగాయత్ స్ఫూర్తిగా భూమి ఇచ్చేందుకు ముందుకొస్తున్న మేడిపల్లి, ప్రతాపసింగారం రైతులతో మాట్లాడి ముం దుకెళతాం’అని మంత్రి వెల్లడించారు.