
ల్యాప్‌టాప్ దొంగల ముఠా ఆటకట్టు
హైదరాబాద్ సిటీ: చూడటానికి ఎగ్జిక్యూటీవ్‌లా ఉంటారు... తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ ధరించి పేపర్ వేసుకుంటారా అంటూ పొద్దు పొద్దునే ఇళ్లలోకి చొరబడుతారు. ఆదమరిచి నిద్రిస్తుంటే అదును చూసి ఇంట్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు, నగదును దోచుకెళ్తారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఉప్పల్‌లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. తమిళనాడుకు చెందిన గురుమూర్తి గోపాల్(20), తిప్పా కలియప్ప(25), పెరిమాళ్ గణేష్(25), నంజప్పన్ వీరేంద్రన్(25)లతో పాటు మరో ఆరుగురు ముఠాగా ఏర్పడి మీర్‌పేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు.
వీరు ఇద్దరు ఇద్దరుగా విడిపోయి ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో ఓ దిన పత్రిక చేతపట్టుకుని పేపర్ సర్య్కూలేషన్ చేసే ఎగ్జిక్యూటివ్‌లా సంచరిస్తుంటారు. అదును చూసి ఇంట్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, నగదును తీసుకొని పారిపోతారు. ఇలా నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య తమ పనిని చక్కపెట్టుకొని వెళ్లిపోతారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో గత కొన్ని రోజులుగా ల్యాప్‌టాప్‌లు పోతున్నాయని ఫిర్యాదులు అందడంతో నిఘా పెట్టిన క్రైం పోలీసులు, ఫిర్యాదుదారులు చెప్పిన ఆనవాళ్లతో అనుమానం వచ్చిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరి వద్ద నుంచి 13 ల్యాప్‌టాప్‌లు, రూ.2లక్షల నగదును స్వాధీనం చేసుకొని సోమవారం రిమాండ్‌కు తరలించారు.