అమెరికాకు చిక్కిన జంబాడా
ఎల్‌చాపో కుమారుడు జోక్విన్ గుజ్మాన్ కూడా
మభ్యపెట్టి వారి విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేసిన వైనం
వాషింగ్టన్: మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారంతో వేలకోట్ల రూపాయల నేరసామ్రాజ్యాన్ని విస్తరించిన డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులకు చిక్కాడు. 76 ఏళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అతనికి తెలీకుండా చాకచక్యంగా ప్రైవేట్ విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు.
గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో సిటీ శివారులోని చిన్న ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్‌చాపో కుమారుడు జోక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్మాన్(38)నూ పోలీసులు అరెస్ట్‌చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్దాలుగా జంబాడా అరెస్ట్‌కోసం అమెరికా ప్రయతి్నస్తోంది.
అతని జాడ చెప్తే రూ.125 కోట్ల నజరానా ఇస్తామని గతంలో ప్రకటించింది. ‘అమెరికాలోకి వందల కోట్ల డాలర్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదకద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీరికి కఠిన శిక్ష పడనుంది’ అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ అన్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపార నిమిత్తం వెళ్తున్నామని అబద్దం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మానే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అత్యంత హింసాత్మక, శక్తివంత ‘ సినోలా కార్టెల్’
మాదకద్రవ్యాల అక్రమ తయారీ, ఎగుమతికి ప్రపంచ కేంద్రస్థానంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక, శక్తివంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకటి. దీనిని ఎల్ చాపో గుజ్మాన్, జంబాడా, మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా అమ్మడం మొదలెట్టారు.
వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ అర్చివాల్డో గుజ్మాన్ లోయెరా (ఎల్‌చాపో)ను 2019లో మెక్సికో ప్రభుత్వం అరెస్ట్‌చేసి అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవితకాలకారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఎల్ చాపో కుమారులు రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికా సహా విదేశాలకు సరకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసన్నల్లో జరుగుతోంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వారి తల నరకడం, చర్మం ఒలిచేయడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం వంటి హేయమైన నేరాలకు పాల్పడటం అక్కడి ముఠాలకు మామూలు విషయం.
Comments
Please login to add a commentAdd a comment