బడి నుంచి డ్రాప్‌‘ఔట్‌’ | The latest calculations of the education department | Sakshi
Sakshi News home page

బడి నుంచి డ్రాప్‌‘ఔట్‌’

Published Tue, Jan 2 2018 2:10 AM | Last Updated on Tue, Jan 2 2018 2:10 AM

The latest calculations of the education department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఆధార్‌ అనుసంధానంతో బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు చెక్‌ పడింది. ఫలితంగా ప్రభుత్వ బడులతోపాటు ప్రైవేటు స్కూళ్లలోనూ ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గిపోయింది. దీంతో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి కూడా తగ్గింది. అయితే డ్రాపౌట్‌ రేటు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. 2015–16 విద్యా సంవత్సరం కంటే 2016–17 నాటికి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలన్నింటిలోనూ డ్రాపౌట్స్‌ పెరిగారు. బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు కొంత మేర చెక్‌ పెట్టగలిగినా డ్రాపౌట్‌ రేటు తగ్గించడం విద్యాశాఖకు సవాల్‌గా మారింది. తెలంగాణ ఎడ్యుకేషనల్‌ స్టాటిస్టిక్స్‌ పేరుతో విద్యా శాఖనే ఈ లెక్కలను తేల్చింది. బడికి దూరమవుతున్న వారిలో ఎస్టీ విద్యార్థులు ఎక్కువగా ఉండగా, అదే స్థాయిలో ఎస్సీ విద్యార్థులూ ఉన్నారు. 

తగ్గిన విద్యార్థులు 1.58 లక్షలు.. 
రాష్ట్రంలోని పాఠశాలల్లో 1,58,586 మంది విద్యార్థులు తగ్గిపోయారు. 2015–16లో పాఠశాలల్లో 61,91,782 మంది ఉండగా, 2016–17 నాటికి ఆ సంఖ్య 60,33,196కు పడిపోయింది. వారిలో 29,26,608 మంది బాలికలు, 31,06,588 మంది బాలురు ఉన్నారు. విద్యార్థుల్లో ఎస్సీలు 10,24,646 మంది, బీసీలు 30,29,205 మంది, ఎస్టీలు 6,78,030 మంది ఉన్నారు. మొత్తంగా 2015–16 విద్యాసంవత్సరంతో పోలిస్తే 1,58,586 మంది విద్యార్థులు తగ్గారు. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, ప్రైవేటు పాఠశాలల్లో పెరగడం సర్వసాధారణం. కానీ ఈసారి రెండింటిలోనూ విద్యార్థులు తగ్గిపోయారు.  

ఎన్ని చర్యలు చేపడుతున్నా.. 
విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేపడుతున్నా డ్రాపౌట్స్‌ను నివారించలేకపోతోంది. ముఖ్యంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 శాతం వరకు విద్యార్థులు డ్రాపౌట్స్‌ కాగా, ఉన్నత పాఠశాలల్లో ఒక్క శాతం బడికి దూరమై డ్రాపౌట్స్‌గా మిగిలారు. ఇక 2007–08లో 8,40,933 మంది విద్యార్థులు ఒకటో తరగతిలో చేరితే, 2016–17లో పదో తరగతికి వచ్చిన వారు కేవలం 5,22,027 మంది మాత్రమే.  

ఎస్సీ, ఎస్టీల్లో అత్యధికం... 
రాష్ట్రంలో 2015–16 విద్యా సంవత్సరంలో డ్రాపౌట్‌ రేటు 36.99 శాతం ఉంటే, 2016–17 విద్యా సంవత్సరంలో 37.92 శాతానికి పెరిగింది. ఎస్సీల్లో 38.90 శాతం, ఎస్టీల్లో 61.09 శాతం విద్యార్థులు డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 18.48 శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 32.33 శాతం, ఉన్నత పాఠశాలల్లో 37.92 శాతం మంది మధ్యలోనే బడి మానేశారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కొమురం భీం జిల్లాలో 65.66 శాతం మంది డ్రాపౌట్స్‌గా ఉన్నారు. జయశంకర్‌ జిల్లాలో 60.77 శాతం, మహబూబాబాద్‌లో 60.36 శాతం, నాగర్‌కర్నూల్‌లో 57.51 శాతం ఉండగా, తక్కువగా వరంగల్‌ అర్బన్‌లో 14.09 శాతం, మేడ్చల్‌లో 16.57 శాతం మంది మధ్యలోనే బడి మానేశారు. బడికి దూరమవుతున్న వారిలో బాలురే అత్యధికంగా ఉండటం గమనార్హం. 

తగ్గిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 
రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తగ్గిపోయింది. బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు చెక్‌ పెట్టడంతో ఇది తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 2015–16లో ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25 ఉండగా, 2016–17లో అది 1:23కి చేరుకుంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:22 నుంచి 1:19కు తగ్గింది. ఉన్నత పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి యథాతథంగానే 1:30 ఉంది.  


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement