
డ్యాన్స్.. గిన్నిస్ అంత..
హైదరాబాద్: వంద స్కూళ్లు... 2,200 మంది విద్యార్థులు... లయబద్ధమైన అందెల సవ్వడులు... అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధులను చేశారు. మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన ‘లావణి’ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్‌బుక్ రికార్డు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు 570 మందితో ప్రదర్శించి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు సాధించిన రికార్డును వెనక్కి నెట్టి తెలంగాణ పేరును గిన్నిస్‌బుక్‌లో లిఖించారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో తనూష్, నీలిమా డ్యాన్స్ అకాడమీల ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులు ప్రదర్శించిన ఈ మహానృత్యాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వీక్షించి పరవశించారు. నాట్య బృందానికి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను మంత్రి అందించారు.
భారతీయ సంస్కృతికి రూపం
భారతీయ సంస్కృతికి రూపమీ లావణి నృత్యమని, చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించారని దత్తాత్రేయ చెప్పారు. గిన్నిస్‌బుక్‌లో చోట్టు దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్, గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అడ్వైజర్ జయంతిరెడ్డి, నిర్వాహకులు వేదకీర్తి, లక్ష్మి పాల్గొన్నారు.