‘లింక్’కు నేడు స్పెషల్ డ్రైవ్
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు
సిటీబ్యూరో: ‘ఆధార్’తో ఓటరు కార్డుల అనుసంధానానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి అవకాశం కల్పిస్తూ శనివారం ఏడు వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. దీని కోసం ఆటోలు, ఎఫ్‌ఎం రేడియో, టీవీ చానెళ్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇదివరకే తమ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆధార్ వివరాలు సేకరించారని, ఇప్పటికీ అనుసంధానం కాని వారి కోసం పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. తక్కువ అనుసంధానం జరిగిన శేరిలింగంపల్లి తదితర సర్కిళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సర్కిళ్లకు సూపర్‌వైజర్లుగా ఉన్నతాధికారులను నియమించారు. స్పెషల్‌డ్రైవ్‌కు సహకరించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కోరినట్టు కమిషనర్ తెలిపారు. కాలనీ సంఘాలు, బస్తీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామన్నారు.
కొత్త దరఖాస్తులు 2 లక్షలు..
తాజా సమాచారం మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో డూప్లికేట్లు, చిరునామా మారిన వారు తదితరులతో కలిసి 73.54 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 15 లక్షల మంది డూప్లికేట్లు, చిరునామా మారిన వారు ఉన్నట్లు అంచనా. అలాంటి పేర్లను జాబితా నుంచి తొలగించే ముందు నోటీసులు జారీ చేస్తారు. మరోవైపు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు కూడా ఇటీవల గణనీయంగా పెరిగారు. ఆధార్ అనుసంధానంతో పాటు స్థానికంగా ఓటు లేని వారికీ అధికారులు అవకాశం కల్పించడంతో వివిధ రూపాల్లో 2 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఆధార్ అనుసంధానాన్ని రెండు వారాల్లో పూర్తిచేసి, అనంతరం కొత్త ఓటర్లపై దృష్టి సారిస్తామని అధికారులు చెబుతున్నారు.