సాక్షి, సిటీబ్యూరో : పెళ్లి చేసుకున్నారు.. జీవితాన్ని అర్థం చేసుకున్నారు.. ఆనందంగా గడుపుతున్నారు. నగరానికి చెందిన ఈప్రేమికులు మేరీ సొలంగ్, ప్రశాంత్ మంచికంటి.. తమ 15ఏళ్ల లవ్ జర్నీ విశేషాలు ‘సాక్షి’తో పంచుకున్నారిలా...
మేరీ: నేను పుట్టింది అబుదాబిలో, పెరిగింది హైదరాబాద్‌లో. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 2002లో డిగ్రీ చేస్తుండగా, ప్రశాంత్ మాకు ఫ్రెంచ్ ప్రొఫెసర్. నాకు ఫ్రెంచ్ ఈజీ. క్లాస్‌లో నవలలు చదువుకునేదాన్ని. ప్రశాంత్ చూసి ఈ అమ్మాయి క్లాస్ వినదు అనుకునేవారు. ఆ తర్వాత రెండేళ్లకి నేను హెచ్‌ఎస్‌బీసీలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా కలిశాం. గుర్తుపట్టి మాట్లాడాను. అప్పుడు ఆయన ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించారు. పార్ట్‌టైమ్ వర్క్ చేస్తావా? అని అడిగారు. అలా మా ప్రయాణం మొదలైంది. తర్వాత ఇద్దరం కలిసి 2006లో ఇఫ్లూలో ఎంఏ చేశాం. అప్పుడే ప్రేమలో పడ్డాం.
పెళ్లి..
మేరీ: చదువు పూర్తయ్యాక 2011లో పెళ్లి చేసుకున్నాం. చదువు, కెరీర్, పెళ్లి అన్నీ కలిసి ప్లాన్ చేసుకున్నామని చెప్పొచ్చు. పదేళ్లకు పెళ్లి చేసుకున్నారా! అని ఫ్రెండ్స్ పెళ్లిరోజు జోక్ చేశారు.
ప్రశాంత్: పెళ్లి హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో జరిగింది. మొదట్లో మావాళ్లు, వాళ్ల వాళ్లు ఈ బంధం నిలబడదని అనుకున్నారు. కానీ వారి అభిప్రాయం తప్పని నిరూపించాం.
భాషాపర ఇబ్బందులు...
మేరీ: మా నాన్న హైదరాబాదీ, అమ్మ ఫ్రెంచ్. గల్ఫ్‌వార్‌తో అబుదాబి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. ఇంట్లో ఫ్రెంచ్ మాట్లాడుతాం. తెలుగు అర్థమవుతుంది. కానీ మాట్లాడటం తెలీదు. మొదట్లో కొంత కష్టమైన, తర్వాత ఇద్దరం మిక్స్‌డ్ లాంగ్వేజ్ మాట్లాడడం ప్రారంభించాం. ఇంగ్లిష్‌లో తెలియని పదాలు ఫ్రెంచ్‌లో మాట్లాడేస్తాను. తను అర్థం చేసుకుంటాడు. అలాగే తను ఇంగ్లిష్, ఫ్రెంచ్, తెలుగు కలిపి మాట్లాడేస్తాడు. ఇది ఇద్దరికీ అర్థమైపోతుంది.
మతపరంగా...
ప్రశాంత్: నేను చాలాకాలం ఫ్రెంచ్ పద్ధతులకు దగ్గరగా ఉన్నాను. కాబట్టి నాకు పెద్దగా తేడా అనిపించదు. ఇక తనకు భారత సంస్కృతీ సంప్రదాయాలంటే చాలా ఇష్టం. ఆమె పాటించే పద్ధతులన్నీ నాకు అంగీకారమే. వ్యక్తిగతంగా ఎవరైనా ఏ పద్ధతి అయినా పాటించే హక్కు ఉందని ఇద్దరం నమ్ముతాం.. పాటిస్తాం.
మేరీ: మతం మాకెప్పుడూ అడ్డంకి కాలేదు. ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉంటే భిన్న సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుస్తుంది. ఇక్కడ పరమత సహనం అలవడుతుంది. ఫ్రాన్స్‌లో మా కజిన్స్ అలా కాదు.. చిన్న తేడాలూ వాళ్లకి పెద్ద విషయమే.
ఫుడ్...
మేరీ: ఇండియన్, ఫ్రెంచ్ వంటలు చేయగలను. ఉడకబెట్టినవి ఆయనకు ఇష్టం. ఫ్రై చేసినవి నాకు ఇష్టం. అందుకే ఇద్దరికీ నచ్చేలా వంటలో మధ్యేమార్గం ఎంచుకున్నాను.
ప్రశాంత్: ఆహారం దంపతుల మధ్య సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వండేప్పుడు ప్రేమనంతా గుప్పించి వండుతారు.. వడ్డిస్తారు. మేరీ ఇండియన్ ఫుడ్ బాగా చేస్తుంది. టిఫిన్స్ నుంచి అన్నీ చేసేస్తుంది. నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె ఫ్రాన్స్ అమ్మాయి అయినా తాగటం తెలీదు. ఆరోగ్య విధానాలు పాటిస్తుంది. ఇంట్లో ఆర్గానిక్ గార్డెన్ తయారు చేసుకుంది.
గొడవలు..
మేరీ:మొదట్లో గొడవ అయితే ఇక మళ్లీ జీవితంలో కలవం, ఇంతటితో అయిపోయిందని అనిపించేది. ఇప్పుడు గొడవ అయితే సాయంత్రానికి సర్దుకుంటుందిలే అనిపిస్తుంది.
ప్రశాంత్: ఒకరికి కోపం వస్తే.. ఇంకొకరు కామ్ అయిపోతుంటాం. బంధం బలపడుతున్నకొద్ది అర్థం చేసుకుంటాం. గొడవలు తగ్గిపోతాయి.
పెళ్లికి ముందు తర్వాత..
ప్రశాంత్:పెళ్లికి ముందు కంటే ఇప్పుడు ఎక్కువ బాధ్యతగా, క్రమశిక్షణతో ఉంటున్నాను. దానికి కారణం తనే.. అలాగే తనలో చాలా ఓర్పు పెరిగింది.
మేరీ: పుట్టింట్లో చేయని కొన్నైనా.. పెళ్లయ్యాక ప్రతి అమ్మాయి మెట్టినింట్లో చేయాల్సి ఉంటుంది. దానికి ఎవరూ అతీతులు కాదు.
పాప రాకతో..
ప్రశాంత్: పాప పుట్టాక మావాళ్లు, వాళ్ల వాళ్లు అందరూ హ్యాపీ. పాప పేరు వేద ఆర్యన్. ఆర్యన్ పదం సంస్కృతం, ఫ్రెంచ్‌లోనూ ఉంది. వాళ్లు పిలుచుకోవడానికి వీలుగా ఈ పేరు సెలెక్ట్ చేశాం.
మేరీ: పాప పుట్టాక ఉద్యోగం మానేశాను. ఇక పాప స్కూల్‌కి వెళ్లే వరకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment