...ఈ పాటికి ఫొటోకు దండలేసేసే వాళ్లు!
''ఏదో మేం క్షేమంగా దిగాం కాబట్టి మీతో ఫోన్లో మాట్లాడగలుగుతున్నాం.. లేకపోతే గాల్లోనే చనిపోయేవాళ్లం. ఈపాటికి ఫొటోకు దండలు వేసి, ఒక విచారణ జరిపేవారంతే''.. ఎయిరిండియా విమానం సాంకేతిక లోపంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత దాన్నుంచి బయటపడిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి స్పందన ఇది. విమానం ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయనను 'సాక్షి టీవీ' ఫోన్లో సంప్రదించింది. జరిగిన ఘటన గురించి అడిగినప్పుడు ఆయన తీవ్రంగానే స్పందించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
''నిన్న ఇది రెండు గంటలు ఆలస్యంగా వెళ్లింది. ఈరోజు కూడా ఆలస్యంగానే విజయవాడకు బయల్దేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అన్నారు. బాగా పాత విమానాలను వాడుతున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రణాళిక ప్రకారం పాత విమానాలను స్క్రాప్లోకి నెట్టేయాల్సిన అవసరం ఉంది. డీజీసీఏ తప్పనిసరిగా ప్రతి ఏడాది విమానాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. మన దేశంలో పేదరికం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో మూలపడిన విమానాలను కూడా వాడుతున్నారు. మన విమానాల్లో చాలామంది ప్రముఖులు, సినిమా నటులు, నాయకులు, సామన్యులు అందరూ వెళ్తుంటారు. అయినా సరిగా పట్టించుకోవడం లేదు.''