
దొంగ పోలీసు అడ్డంగా బుక్కయ్యాడు!
హైదరాబాద్ సిటీ: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బులు, నగలు దోచుకుంటున్న ఓ నకిలీ పోలీసు (సూడో పోలీసు) ఆటకట్టించారు. మంగలే సుభాష్ మిట్టల్ అనే పాత నేరస్తుడు గతంలో ఎన్నో చోరీలకు పాల్పడ్డాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆ దొంగ.. ఏకంగా పోలీసు అవతారం ఎత్తాడు. నేర ప్రవృత్తికి అలవాడు పడ్డ సుభాష్ మిట్టల్.. గత కొన్ని రోజులుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకున్నాడు. పోలీస్‌నంటూ చెప్పి ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను బెదిరించేవాడు.
ఆపై తనిఖీల పేరుతో వారి వద్ద నుంచి డబ్బులు, బంగారాన్ని దోచుకొని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యేవాడు. ఈ క్రమంలో చోరీ చేసి పారిపోతుండగా మాదాపూర్ పోలీసులు ఆ దొంగ పోలీసును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, 15 తులాల వెండి పట్టాల గొలుసులు, రూ.23 వేల నగదు, ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు సుభాష్ మిట్టల్‌ను రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.