
పదివేలకు మగశిశువు విక్రయం
ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఓ మహిళ కన్న పేగును కాదనుకుంది.
- ఆర్థిక ఇబ్బందులతోనే అంటున్న కన్నతల్లి
- కొనుగోలు చేసిన ఇద్దరు మహిళలతో పాటు తల్లి అరెస్టు
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఓ మహిళ కన్న పేగును కాదనుకుంది. రెండున్నర నెలల పసిగుడ్డును పదివేల రూపాయలకు అమ్ముకుంది. భర్త ఫిర్యాదుతో పోలీసులు తల్లితో పాటు మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని తుకారాంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తర మండల డీసీపీ కార్యాలయంలో శుక్రవారం గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు వివరాలను మీడియాకు తెలిపారు. తుకారాంగేట్ వడ్డెర బస్తీకి చెందిన రాజు కూలి పనులు చేస్తుంటాడు. ఇతని భార్య కవిత రెండున్నర నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది.
కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెల 23న రాజు సెంట్రింగ్ పని నిమిత్తం యాదగిరిగుట్టకు వెళ్లి.. మూడు రోజుల క్రితం వచ్చాడు. ఇంటి వద్ద కవిత, బిడ్డ కనిపించలేదు. కవిత సెల్ స్విచ్ ఆఫ్ రావడంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం రాజును కలిసేందుకు వచ్చిన కవిత బిడ్డను పది వేల రూపాయలకు అమ్మానని చెప్పింది. దీంతో రాజు తుకారాంగేటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉండే బెల్లంపల్లికి చెందిన సుమతో కలసి బిడ్డను గోదావరిఖనికి చెందిన అంజలికి పదివేల రూపాయలకు అమ్మినట్లు పోలీసులకు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొంది. దీంతో సుమను, అంజలిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో శిశువును శిశుహోమ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.