
కార్మికులకు ‘మేడే’ వరాలు!
నేడు ప్రకటించనున్న సీఎం కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ‘మేడే’ వరాలు ప్రకటించనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు అత్యుత్తమ సేవలు, భద్రత, సంక్షేమం కల్పించే దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేశారు. మేడే సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కార్మిక సంఘాలు, నేతల సమక్షంలో సీఎం వరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రమాద బీమాను రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచనున్నారు.
అలాగే ఏదైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అంగవైకల్యానికి గురయ్యే కార్మికులకు చెల్లిస్తున్న రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని రూ. 5 లక్షలకు పెంచనున్నారు. అదే విధంగా కృత్రిమ అవయవాలను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికుల వివాహం సందర్భంగా ఇచ్చే రూ. 10 వేల నజరానాను కూడా పెంచే అవకాశం ఉంది. అలాగే మెటర్నిటీ కోసం అందజేసే నిధులు, సహజ మరణం పొందిన కార్మిక కుటుబానికి ఇచ్చే నిధులను కూడా పెంచాలని యోచిస్తోంది.
కార్మికులకు ఉత్తమ అవార్డులు
మేడే సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన కార్మికులను ప్రభుత్వం ‘శ్రమశక్తి’ అవార్డులతో సత్కరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది కార్మికులకు అవార్డులు ఇచ్చేందుకు కార్మికశాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే కార్మికుల సంక్షేమం, భద్రత కోసం పెద్దపీట వేసే పరిశ్రమ యాజమాన్యాలను కూడా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పది అత్యుత్తమ యాజమాన్యాలను గుర్తించింది. వారిని ‘బెస్ట్ మేనేజ్‌మెంట్’ అవార్డులతో సత్కరించనుంది.