
ఎంబీబీఎస్ సిలబస్ మార్చాలి
* వైద్య విద్యపై పలు సూచనలు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
* ఆధునిక వైద్య పద్ధతులతో కూడిన సిలబస్‌ను రూపొందించాలి
* తక్షణమే యూజీ వైద్యవిద్యను పునర్నిర్మించాలి
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్ వైద్యవిద్య) ఆశాజనకంగా లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. తాజాగా ఇచ్చిన నివేదికలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి పలు సూచనలు చేసింది. ‘‘ప్రాథమిక వైద్యంలో ఎంబీబీఎస్‌లది కీలక పాత్ర. కానీ వస్తున్న జబ్బులకు, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ల పనితీరుకూ పొంతనే లేదు.
అండర్ గ్రాడ్యుయేషన్ వైద్యవిద్య నాణ్యత లేని విద్యగా మారింది. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఆధునిక వైద్య పద్ధతులు అవలంబిస్తేగానీ ఈ కొత్త జబ్బులకు పరిష్కారం లభించదు. కానీ మనకున్న సిలబస్ ఎప్పుడో పద్నాలుగేళ్ల క్రితం రూపొందించినది. ఇలాంటి సిలబస్‌నే ఇప్పటికీ బోధిస్తున్నామంటే ఆశ్చర్యపరిచే అంశం. ప్రస్తుతం మారిన పరిస్థితులు, వస్తున్న జబ్బుల రీత్యా తక్షణమే ఎంబీబీఎస్ సిలబస్‌ను మార్చాల్సిన అవసరం ఉంది.
ఫ్యామిలీ మెడిసిన్, గేరియాట్రిక్, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్, ఎమర్జెన్సీ కేర్ వంటి సబ్జెక్టులతో కూడిన బోధన జరగాలి. అప్పుడే ఎక్కువ మంది రోగులకు ఉపయోగం ఉంటుంది’’ అని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది. మిగతా కోర్సుల్లాగా వైద్య విద్య ఉండకూడదని, పరిస్థితులకు అనుగుణంగా మారాలని, స్కిల్ ట్రైనింగ్ అనేది ఎంబీబీఎస్ డాక్టర్‌కు చాలా ముఖ్యమని కమిటీ చెప్పింది. ప్రీవెంటివ్, క్యూరేటివ్, రిహాబిలిటేటివ్ కోణంలో వైద్యం అందించే ప్రక్రియ ప్రస్తుత పరిస్థితుల్లో లేదని అభిప్రాయపడింది. ఎంబీబీఎస్ విద్యలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని ఎంసీఐకి స్టాండింగ్ కమిటీ సూచించింది. ఇప్పటికే సిలబస్ రూపకల్పన, బోధనాపద్ధతుల్లో మార్పులు వంటి విషయాలు అమల్లోకి తీసుకురావడంలో తీవ్రంగా జాప్యం జరిగిందని చెప్పింది.
కమిటీ చెప్పిన పలు అంశాలు...
* ఐదేళ్లకోసారి ఆధునిక వైద్య పద్ధతులననుసరించి సిలబస్‌లో మార్పులు చేర్పులు చేయాలి.
* ప్రస్తుత విధానం జనరల్ ప్రాక్టీషనర్‌కు గౌరవప్రదంగా లేదన్నది స్పష్టమైంది.
* ప్రస్తుత ఎంబీబీఎస్ డాక్టర్‌కు సాధారణ ప్రసవం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది.
* ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌లోకి వచ్చిన 90 శాతం మందికి పీజీ సీటు ఎలా సంపాదించాలనే ధ్యాస ఉంది గానీ వైద్యం మీద అవగాహన ఏ మాత్రం లేదు.
* ప్రస్తుతం ఉన్న బోధనాపద్ధతులు సైతం కొత్త పుంతలు తొక్కేలా లేవు.
* ప్రైమరీ, సెకండరీ హెల్త్‌కేర్‌లో రోగికి వైద్యం చేస్తామన్న నమ్మకం ఎంబీబీఎస్ డాక్టర్‌లో లేదు
* దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న వైద్య విద్య కేంద్రీకృతమై ఉంది. ఇది తక్షణమే వికేం ద్రీకరణ జరగాలి.
* క్లినికల్ విభాగంతో పాటు పబ్లిక్ హెల్త్‌లో వైద్యులకు కచ్చితమైన ఓరియంటేషన్ (అవగాహన) అవసరం ఉంది
* దేశంలో కావాల్సిన వైద్య అవసరాలు, ఆ అవసరాలకు తగ్గట్టు డాక్టర్లను తయారు చేయడంలో ఎంసీఐ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా గ్రామీణ వైద్యంపై కనీసం దృష్టి సారించలేకపోవడం ఆశ్చర్యకరం.
* ఎంబీబీఎస్ డాక్టర్ కేవలం క్లాస్‌రూమ్ పాఠాలకే పరిమితమవుతున్నారు. వారికి నైతిక విలువలు, రోగి క్షేమం, రోగి సంరక్షణ, సామాజిక కోణం, మానవతా దృక్పథం వంటివేవీ తెలియడం లేదు.
* దేశంలో 55 వేల ఎంబీబీఎస్ సీట్లుంటే.. పీజీ సీట్లు కేవలం 25 వేలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పీజీ వైద్యులు కాలేని ఎంబీబీఎస్ కోర్సుతోనే ఉన్నతమైన వైద్యసేవలు అందించే పరిస్థితులు కల్పించాలి.
* ఈ పరిస్థితులున్నప్పుడు ప్రైమరీ, సెకండరీ హెల్త్‌కేర్‌లో ఎంబీబీఎస్‌లకు గుర్తింపు వస్తుంది
* దేశవ్యాప్తంగా యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) వైద్యవిద్యను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది